West Bengal Sandeshkhali Incident: పార్ల‌మెంటు(Parliament) ఎన్నిక‌ల‌(Elections)కు ముందు ప‌శ్చిమ బెంగాల్‌(West Bengal)లో వెలుగు చూసిన ఘ‌ట‌న ఆ రాష్ట్రాన్నే కాకుండా.. రాజ‌కీయాల‌ను కూడా తీవ్ర‌స్థాయిలో కుదిపేస్తోంది. గ‌త వారం రోజులుగా దేశంలో ముఖ్యంగా ఉత్త‌రాదిన పెను సంచ‌ల‌నంగా మారిన `సందేశ్ ఖాలీ` ఘ‌ట‌న‌.. మ‌మ‌తా బెన‌ర్జీ(CM Mamata benarji) ప్ర‌భుత్వాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతోంది. ఉత్త‌రాది స‌హా ఢిల్లీ వ‌ర్గాలు, సుప్రీంకోర్టులోనూ ఈ ఘ‌ట‌న తీవ్ర సంచ‌లనంగా మారింది. ముఖ్యంగా ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ వ‌ర్సెస్‌, బీజేపీ(BJP)ల మ‌ధ్య నిప్పులు రాజేసింది. అంతేకాదు.. ఒక‌వైపు మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ (TMC) సంద‌ర్శ‌న‌... రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు డిమాండ్‌, మ‌రోవైపు.. పార్ల‌మెంటు ఎథిక్స్ క‌మిటీ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌.. సుప్రీంకోర్టులో వ‌రుస కేసులు.. ఇలా మొత్తంగా.. ప‌శ్చిమ బెంగాల్ ను సందేశ్ ఖాలీ అంశం పెద్ద ఎత్తున కుదుపున‌కు గురి చేస్తోంది.


ఏం జ‌రిగింది?


సందేశ్ ఖాలీ(Sandeshkhali).. అనేది ప‌శ్చిమ బెంగాల్‌లోని 24 ఉత్త‌ర‌ప‌ర‌గ‌ణాల(24 Uttarapaganas) జిల్లాలో ఉన్న ఓ మారు మూల గ్రామం. ఇక్క‌డ అధికార పార్టీ తృణ‌మూల్‌కు చెందిన కీల‌క నేత షాజ‌హాన్ షేక్ అనుచ‌రులు.. త‌మ భూముల‌ను బ‌ల‌వంతంగా క‌బ్జా చేశార‌ని, దీనిని ప్ర‌శ్నించిన త‌మ‌పై.. లైంగిక దాడులు చేశార‌ని, ఒక‌రిద్దరిద్ద‌రిపై అత్యాచారం(Rape) కూడా చేశార‌ని.. ఇక్క‌డి మ‌హిళ‌లు ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారం... గ‌త వారం వెలుగు చూసింది. ఈ విష‌యం రాష్ట్రంలో పెను దుమారం రేపింది. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ప్ర‌తిప‌క్ష బీజేపీ దీనిని సీరియ‌స్‌గా తీసుకుంది. వెంట‌నే రాష్ట్ర బీజేపీ నాయ‌కుడు, పార్ల‌మెంటు స‌భ్యుడు సుకాంత మ‌జుందార్‌.. ఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఆయ‌న‌ను అడ్డుకునేందుకు అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప్ర‌య‌త్నించ‌డంతో బీజేపీనేత‌ల‌కు, వారికి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది.  వీరిని అదుపు చేసే క్ర‌మంలో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దీంతో ఎంపీ మ‌జుందార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది మ‌రో వివాదానికి దారి తీసింది. త‌న‌ను పోలీసులు కోట్టారంటూ.. ఎంపీ పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు.


ఎథిక్స్ క‌మిటీ.. 


ఎంపీపై దాడిని సీరియ‌స్‌గా తీసుకున్న స్పీక‌ర్(Speaker).. పార్ల‌మెంటు ఎథిక్స్ క‌మిటీ(Ethics Committee) క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి ఏం జ‌రిగిందో నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. ఇది మ‌రింత‌గా రాజ‌కీయ దుమారం రేపింది. మ‌రోవైపు బాధితుల‌మ‌ని చెబుతున్న మ‌హిళ‌లు.. మీడియా ముందుకు రావ‌డం, వారికి బీజేపీ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో భోగి మంట‌లు రాజుకున్నాయి. దీనిపై మ‌హిళా క‌మిష‌న్ కూడా తీవ్రంగా స్పందించి.. ఏకంగా ఇద్ద‌రు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని సందేశ్ ఖ‌లీ గ్రామానికి పంపించింది. అయితే.. వారిని కూడా తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. దీంతో క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌.. రేఖాశ‌ర్మ రంగంలోకి దిగారు. సోమ‌వారం ఆమె బెంగాల్‌లో ప‌ర్య‌టించారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఆ వెంట‌నే.. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తిపాల‌న విధించాల‌ని డిమాండ్ చేశారు. 


సీఎం మ‌మ‌త రివ‌ర్స్ 


ఇలా.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డంతో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందిస్తూ.. ఇదంతా ఉద్దేశ పూర్వ‌కంగా ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ఆడుతున్న నాట‌కంగా పేర్కొన్నారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ‌పై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని ఆమె ఆరోపించారు. మ‌రోవైపు బాధిత మ‌హిళ‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చిన మ‌హిళా క‌మిష‌న్‌.. వారితో కేసులు పెట్టించింది. దీంతో 18 మంది అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై రేప్‌, హ‌త్యాయ‌త్నం కింద పోలీసులు కేసులుపెట్టారు. ఇక‌, రాష్ట్రంలోకి పార్ల‌మెంటు ఎథిక్స్ క‌మిటీ రావ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తూ.. తృణ‌మూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు ఎక్కింది. దీనిని విచారించిన కోర్టు ఎథిక్స్ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌పై స్టే విధించింది. ప్ర‌స్తుతం సందేశ్ ఖాలీలో ప్ర‌స్తుతం అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. 


నిప్పులు చెరిగిన రేఖా శ‌ర్మ‌


సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ నేతలు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో బంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​(NCW) రేఖా శర్మ(Rekhasarma) డిమాండ్ చేశారు. అలాగే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని వ్యాఖ్యానించారు. 


సుప్రీంకోర్టు స్టే!


సందేశ్‌ఖాలీ కేసులో పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై లోక్‌సభ సెక్రటేరియట్‌, కేంద్ర హోంశాఖకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.  మ‌రోవైపు బంగాల్ బీజేపీ చీఫ్, ఎంపీ సుకాంత మజుందార్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రివిలేజెస్‌ కమిటీ బంగాల్‌ చీఫ్‌ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీనిపై బంగాల్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై సోమవారం దర్యాప్తు చేపట్టిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌, బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. అప్పటిదాకా లోక్‌సభ కమిటీ దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.