TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Trinamool Congress Rebel MPs: బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన సంక్షోభం నెలకొంది. అభిషేక్ బెనర్జీ అహంకారంపై కల్యాణ్ బెనర్జీ కూడా తిరుగుబాటు చేశారు.

Mamata Banerjee Existential Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం తన మనుగడలోనే అత్యంత ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, నాలుగుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ గడ్డపై జయకేతనం ఎగరేసిన మమతా బెనర్జీ సామ్రాజ్యం ఇప్పుడు అంతర్గత తిరుగుబాటుతో కుప్పకూలే స్థితికి చేరింది. పార్టీలో మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడు, సీనియర్ పార్లమెంటేరియన్ అయిన కల్యాణ్ బెనర్జీ.. పార్టీ సెకండ్-ఇన్-కమాండ్, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగరేస్తూ "ఇకపై పార్టీలో నేనైనా ఉండాలి, లేదా అభిషేక్ అయినా ఉండాలి" అంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం కోల్‌కతా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
కల్యాణ్ బెనర్జీ తన ఆవేదనను, ఆగ్రహాన్ని బహిరంగంగానే వెళ్లగక్కారు. "అభిషేక్ బెనర్జీ అహంకారపూరిత వైఖరి, దురుసు ప్రవర్తన మొత్తం పార్టీని నాశనం చేశాయి. ప్రతిరోజూ తాను ఒక 'రాజు'లా ఫీల్ అవుతూ తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్లకు తీవ్ర అవమానంగా మారాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, మమతా బెనర్జీ వెనుక నేను ఒక సైనికుడిలా నిలబడినప్పుడు.. అభిషేక్ వైఖరి వల్ల పార్టీలో కలిసి పనిచేయడం నాకు అసాధ్యంగా మారింది" అంటూ కల్యాణ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ బెనర్జీ అప్రజాస్వామిక పద్ధతుల వల్లే పార్టీ ఈరోజు ఈ స్థితికి దిగజారిందని ఆయన మండిపడ్డారు.
ఈ అంతర్గత పోరు ఇంత తీవ్రం కావడానికి ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ప్రధాన కారణం. గత మూడు ఎన్నికల్లోనూ 200కు పైగా స్థానాలు సాధిస్తూ వచ్చిన టీఎంసీ, ఈసారి కేవలం 80 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చారిత్రాత్మక ఓటమి పార్టీలోని లొసుగులను, అసంతృప్తిని ఒక్కసారిగా బయటపెట్టింది. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ సీనియర్లను పక్కనపెట్టడం, పార్టీలో అవినీతి మరియు అక్రమాలను గుడ్డిగా సమర్థించడం వల్లే ప్రజలు తమను తిరస్కరించారని పార్టీలోనే గట్టి విమర్శలు వినిపిస్తున్నాయి. మమత తన వ్యక్తిగత ఇమేజ్‌తో ఇన్నాళ్లూ పార్టీని కాపాడుకుంటూ వచ్చినా, ఇప్పుడు ఆ మ్యాజిక్ పని చేయకపోవడంతో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
SHOCKER 🚨 Kalyan Banerjee says
— News Algebra (@NewsAlgebraIND) June 11, 2026
"Mamata Banerjee will have to choose between us and Abhishek Banerjee" 🤯
UNBELIEVABLE!! Not a single person was expecting this 😳
"Mamata Di has to first decide that she cannot move the party with Abhishek Banerjee"
"If Abhishek is there, I… https://t.co/n0T3LM4MqC pic.twitter.com/CnbCXu0aZg
ఈ సంక్షోభం కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాలేదు, ప్రాక్టికల్‌గా పార్టీ చీలిక వైపు అడుగులు పడ్డాయి. పార్టీకి చెందిన 29 మంది లోక్‌సభ సభ్యులలో ఏకంగా 20 మంది ఎంపీలు మమతా బెనర్జీ నాయకత్వానికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మమతకు అత్యంత ఆప్తులుగా పేరుగాంచిన కాకొలి ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్ వంటి సీనియర్ మహిళా నేతల నేతృత్వంలోని ఈ 20 మంది రెబల్ ఎంపీల బృందం.. ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రి, బీజేపీ బెంగాల్ ఇన్‌ఛార్జ్ భూపేంద్ర యాదవ్‌తో పాటు సువేందు అధికారితో రహస్యంగా సమావేశమైంది. వీరంతా త్వరలోనే లోక్‌సభ స్పీకర్‌ను కలిసి తాము ప్రత్యేక గ్రూపుగా విడిపోతున్నామని, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తామని లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఒకవైపు క్షేత్రస్థాయిలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు చేసి కొత్త ప్రతిపక్ష నేతను ఎన్నుకోగా, ఇప్పుడు ఢిల్లీ వేదికగా 20 మంది ఎంపీలు చేజారిపోతుండటంతో మమతా బెనర్జీ పూర్తిగా ఒంటరిగా మారిపోయారు. పార్టీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ నియామకాన్ని తిరుగుబాటు వర్గం తిరస్కరిస్తుండగా, మమత క్యాంప్ మాత్రం కల్యాణ్ నియామకమే చెల్లుతుందని వాదిస్తోంది. దశాబ్దాలుగా వీధి పోరాటాలు చేసి పార్టీని నిర్మించిన ఫైటర్ మమతా బెనర్జీ చేతులెత్తేసే పరిస్థితిని సొంత మేనల్లుడి అనాలోచిత వ్యూహాలే కల్పించాయనేది రాజకీయవర్గాల విశ్లేషణ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















