West Bengal SSC Scam:
అవినీతిమయ రాజకీయాలకు నిదర్శనం: భాజపా
పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ సర్వీస్ కమిషన్ SSCస్కామ్ సంచలనం రేపుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీపై భాజపా సీనియర్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. "బెంగాల్‌లో ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతోందో ఇలాంటి కుంభకోణాలే చెబుతున్నాయి. ప్రజలు పూర్తి నిజాలు తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది" అని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారన్న కేసులో ఈడీ పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ విషయమై మరో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. "అవినీతి రాజకీయాలు" అంటూ తృమూల్‌ని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "బెంగాల్ ప్రజలతో పాటు దేశమంతా ఈ అవినీతి పాలనను గమనిస్తోంది. మంత్రి సన్నిహితుల ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దొరికాయి. ఇక్కడి రాజకీయాలు ఎంత అవినీతిమయం అయ్యాయో తెలుస్తోంది" అని విమర్శించారు. ఈడీపై అనవసరపు ఆరోపణలు చేస్తున్న మమతా బెనర్జీ నాయకత్వంపైనే అనుమానాలున్నాయని చంద్రశేఖర్ అన్నారు. రాజకీయ రంగు పూస్తున్నారన్న ఆరోపణలూ కొట్టిపారేశారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను భయపెట్టి, తమ అవినీతి బయటపడకుండా చేసుకోవాలని చూస్తున్నారని మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. సీబీఐకి, ఈడీకి వ్యతిరేకంగా మాట్లాడే మమత, ఇలాంటి కుంభకోణాల్ని బయటపెట్టిన సమయంలో మాత్రం మౌనంగా ఉంటారని అన్నారు. అటు తృణమూల్ మాత్రం, ప్రస్తుత పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని, సరైన సమయంలో సరైన విధంగా సమాధానం చెబుతామని అంటోంది.
మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. స్కూల్ సర్వీస్ కమిషన్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ విషయంలో అక్రమాలకు పాల్పడిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అర్పిత ముఖర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ, రూ.20 కోట్లు స్వాధీనం చేసుకుంది. పార్థ ఛటర్జీ ఇతర సన్నిహితులందరి ఇళ్లపైనా ఈడీ దాడులు చేస్తోంది. ఛటర్జీ విద్యాశాఖా మంత్రిగా ఉన్న సమయంలో సెక్రటరీగా ఉన్న సుకాంత అచర్జీతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న చందన్ మొండల్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. టీచర్ ఉద్యోగం ఇస్తామని పెద్ద మొత్తంలో చందన్ పలువురి నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. వీరితో పాటు స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని ఐదుగురు సభ్యుల కమిటీ కన్వీనర్ ఇంట్లోనూ రెయిడ్ జరిగింది. ఈ అందరి ఇళ్ల నుంచి కొన్ని డాక్యుమెంట్లు, రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫారిన్ కరెన్సీని రికవరీ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.