తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చలిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళలో చలి కాస్త పెరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. వాతావరణ విభాగం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. డిసెంబరు 26 మాల్దీవులు, దానిని ఆనుకొని ఉన్న కొమోరిన్ ప్రాంతం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం బలహీనపడిందని తెలిపారు. ఏదైమైనప్పటికీ, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతం మీద సగటు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని డిసెంబరు 28 నాటి వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఈరోజు, రేపు, పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.
మన్యం జిల్లాలో పెరుగుతున్న చలి
మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. మూడు రోజులుగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. చింతపల్లి 10, లంబసింగి 8, డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, పాడేరు, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పదిన్నర గంటల వరకు కూడా పొగ మంచు దట్టంగా కనిపిస్తుండగా, ఆ తరువాత నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఎండ కాస్తున్నది. మళ్లీ నాలుగు గంటల నుంచి యథావిథిగా చలి మొదలవుతుంది.
ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.
పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.