Weather Latest Update: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ రెండు ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం చూడవచ్చు. 


ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా 43 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదుకు ఛాన్స్ ఉంది. 


సోమవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో అక్కడక్కడా పిడుగులు పడొచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తోంది. 






ఆదివారం తెలంగాణలో ఎండలు మండిపోయాయి. చాలా జిల్లాల్లో సూరీడు సెగలు పుట్టించాడు. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఎండలకు ప్రజలు అల్లాడిపోయారు. తేమ శాతం కూడా 40 కంటే తక్కవ ఉండటంతో జనం మరింత ఇబ్బంది పడ్డారు. మరో రెండు రోజులు ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉంది. 






హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఎల్బీనగర్, కొత్తపేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నాంపల్లి,లక్డీకపూల్, బంజారాహిల్స్‌,ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అంబర్‌పేట ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. 


వచ్చే మూడు రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావం హైదరాబాద్‌పై ఉంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఎండలకు అల్లాడిపోయిన జనం ఈ వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. అయితే వర్షాలు పడుతున్నా ఉష్ణోగ్రత మాత్రం ఏ మాత్రం తగ్గదని వాతావరణ శాఖ చెబుతోంది. 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకు ఛాన్స్ ఉందని చెబుతుంది. హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించనుందని పేర్కొంది. 






తెలంగాణలోని కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. జూన్‌ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.


తెలంగాణలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన జిల్లాలు 
ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్‌, జయశంకర్‌ భూపాల్ పల్లి, మహబూబాబాద్, సూర్యపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూలు, ఖమ్మం, పెద్దపల్లి