ISRO Gaganayan Mission: భారత అంతరిక్ష చరిత్రలో అపూర్వ ఘట్టానికి నాంది పలకనున్నారు. ఆరు దశాబ్దాల భారత అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం మొదలు కాబోతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO చేపట్టిన మానవ సహిత అంతరిక్ష మిషన్ గగనయాన్ ప్రాజెక్టులో తొలి అడుగు వచ్చే నెలలోనే పడబోతోంది..
అంతరిక్షంలో భారత మానవ యుగానికి ఆరంభ ఘట్టం- స్పేస్లోకి వ్యోమిత్ర
డిసెంబర్‌లో జరగనున్న G1 మిషన్ ఈ దిశలో మొదటి ముఖ్యమైన అడుగు. ఈ ప్రయోగంలో వ్యోమిత్ర (Vyomitra) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోను స్పేస్లోకి పంపనున్నారు.కొన్ని సంవత్సరాలుగా మన పరిశోధన సంస్థలు ఈ ఈ స్పేస్ రోబో Vyomitra ను రూపొందించాయి. ఈ మిషన్‌లో ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్ సిస్టమ్, అవియానిక్స్, సేఫ్టీ ప్రోటోకాల్‌లు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లు వంటి భాగాలను అసలు అంతరిక్ష పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. వ్యోమిత్ర స్పేస్ ఫ్లైట్ సేకరించే డేటా, భవిష్యత్తులో మానవ యాత్రల భద్రతా ప్రమాణాల కోసం కీలకంగా ఉపయోగపడుతుంది.
గగనయాన్ మిషన్ భారత అంతరిక్ష చరిత్రలో కొత్త యుగాన్ని ప్రారంభించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ISRO, స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన క్రూస్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, ఎస్కేప్ సిస్టమ్ వంటి కీలక టెక్నాలజీలను పరీక్షిస్తోంది. దీని లక్ష్యం — భారతీయ వ్యోమగాములను భవిష్యత్తులో భూమి చుట్టూ కక్ష్యలోకి పంపి, సురక్షితంగా తిరిగి తీసుకురావడం.
స్వతంత్ర మానవ అంతరిక్ష శక్తిగా భారత్
వ్యోమిత్ర ఫ్లైట్ విజయవంతమైతే, భారత్ మానవ అంతరిక్ష యాత్రకు సాంకేతికంగా సిద్ధమవుతుంది. ఇది మన ISRO ధృఢ సంకల్పానికి ప్రతీక. స్వదేశీ రాకెట్ ఇంజినీరింగ్, స్పేస్ రోబోటిక్స్, లైఫ్ సపోర్ట్ టెక్నాలజీలు వంటి రంగాల్లో మనం ఎంత పురోగతి సాధించామో ఈప్రయోగం ద్వారా భారత్ ప్రపంచానికి చాటనుంది. ఇప్పటివరకు ఈ స్థాయికి చేరుకున్న దేశాలు కేవలం అమెరికా, రష్యా, చైనా మాత్రమే. గగనయాన్ ద్వారా భారత్ ఆ జాబితాలో చేరడం, శాస్త్రసాంకేతిక రంగంలో మైలురాయిగా నిలుస్తుంది.
భారీ ప్రణాళికలతో ISRO
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత విస్తృతమైన ప్రణాళికను అమలు చేస్తోంది. 2026 మార్చి నాటికి ఏడు కీలక మిషన్‌లను పూర్తి చేయడం, అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న ఐదేళ్లలో 50 రాకెట్ లాంచ్‌లు అనే విజన్ సాధించడం ఈ వ్యూహం యొక్క ప్రధాన భాగం. ఈ ప్రణాళికలో కేవలం రాకెట్ ప్రయోగాల సంఖ్య పెరగడం మాత్రమే కాదు మానవ అంతరిక్ష ప్రయాణం, భారత స్పేస్ స్టేషన్ నిర్మాణం,దీర్ఘకాల మిషన్‌లు వంటి కొత్త దిశల్లోనూ ఇస్రో పయనించనుంది.
విస్తరించిన బడ్జెట్- విస్తృత ప్రయోగాలు..
చంద్రయాన్ సక్సెస్ చేసి.. మంగళయాన్ను విజయవంతం చేసిన భారత్.. తన గగనయాన్ ప్రాజెక్టు తర్వాత మరో భారీ టార్గెట్ పెట్టుకుంది. గగనయాన్ ప్రాజెక్ట్‌ను విస్తరించి,భారత స్పేస్ స్టేషన్ నిర్మాణం కూడా ఇందులో భాగంగా చేర్చారు. దీని కోసం ప్రభుత్వం మొత్తం బడ్జెట్‌ను ₹20,193 కోట్లకు (సుమారు $2.4 బిలియన్) పెంచింది. ఈ బడ్జెట్ కేవలం గగనయాన్ మానవ యాత్రలకే కాదు 2028 వరకు సాగే దీర్ఘకాల మిషన్‌లు, స్పేస్ స్టేషన్ మాడ్యూల్ డిజైన్, లాంగ్-డ్యూరేషన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లు అభివృద్ధికి కూడా వినియోగిస్తారు. ఈ విస్తృత ప్రోగ్రామ్‌లో 600కి పైగా భారతీయ వెండర్లు, పరిశ్రమలు, టెక్ స్టార్టప్‌లు పాల్గొంటున్నాయి. ఇది స్వదేశీ పరిశ్రమలకు అంతరిక్ష రంగంలో పెద్ద అవకాశాలను తెరుస్తోంది. స్పేస్ హాబిటేషన్, రోబోటిక్ అసిస్టెన్స్, ఆటోమేటెడ్ కంట్రోల్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించబోతోంది.
భారత స్పేస్ స్టేషన్ – 2035 నాటికి లక్ష్యం
ISRO ఇప్పటికే భారత స్పేస్ స్టేషన్ (BSS) నిర్మాణానికి పునాది వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2035 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత బడ్జెట్‌లోని భాగం ప్రారంభ పరిశోధన, హ్యాబిటాట్ మాడ్యూల్ డిజైన్, ఆక్సిజన్ మరియు వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్‌లు, స్పేస్ పవర్ జనరేషన్ టెక్నాలజీలు వంటి విభాగాలకు కేటాయించారు. భారత స్పేస్ స్టేషన్ ద్వారా ISRO భూమి చుట్టూ స్వతంత్రంగా మానవ యాత్రలు, ప్రయోగాలు, పరిశోధనల సామర్థ్యాన్ని సాధించబోతోంది. ఇది అమెరికా (ISS), రష్యా, చైనా తర్వాత స్వతంత్ర స్పేస్ స్టేషన్ కలిగిన అరుదైన దేశాల జాబితాలో భారత్‌ను నిలబెట్టనుంది.