Viral Video: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఏజెంట్ ఓ ఫ్లాట్ ఎదురుగా ఉన్న షూస్‌ని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడి సీసీ కెమెరాలో ఆ ఏజెంట్ షూస్‌ని ఎత్తుకెళ్తున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. గ్రాసరీ డెలివరీ చేసేందుకు మెట్లపై నుంచి వచ్చిన ఆ ఏజెంట్ డోర్ బెల్ కొట్టాడు. ఆ తరవాత చుట్టూ గమనించాడు. అక్కడే మూడు జతల షూస్ కనిపించాయి. ఈ లోగా ఓ మహిళ తలుపు తెరిచింది. ఆ ప్యాక్‌ని తీసుకుని లోపలికి వెళ్లిపోయి మళ్లీ తలుపు వేసింది. వెంటనే మెట్లు దిగి వెళ్లిపోయిన ఏజెంట్ మళ్లీ వెనక్కి తిరిగి చూశాడు. ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నటించాడు. జేబులో ఉన్న రుమాలు తీసి ముఖం తుడుచుకున్నాడు. మెల్లగా పైకి ఎక్కి అక్కడే ఉన్న ఓ షూ జతపై ఆ ఖర్చీఫ్ వేశాడు. ఖర్చీఫ్‌తో పాటు షూస్‌ని దొంగిలించాడు. ఆ తరవాత కస్టమర్ సీసీ కెమెరా ఫుటేజ్ చూసి స్విగ్గీ ఏజెంట్ తన ఫ్రెండ్ షూస్‌ని చోరీ చేసినట్టు గుర్తించాడు. వెంటనే ఆ ఫుటేజ్‌ని X లో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 11న ఈ వీడియో షేర్ చేశాడు. వెంటనే ఇది వైరల్ అయిపోయింది.
గుడ్‌గావ్‌లో జరిగిన ఈ ఘటన వైరల్ అవడం వల్ల స్విగ్గీ స్పందించింది. తమను నేరుగా సంప్రదించాలని, అవసరమైన సాయం అందిస్తామని పోస్ట్ చేసింది. కానీ...అప్పటికే ఆ పోస్ట్ వైరల్ అవడంతో పాటు చాలా మంది రకరకాల కామెంట్స్ పెట్టి స్విగ్గీని ఓ ఆట ఆడేసుకున్నారు. నిజంగా కస్టమర్స్ పట్ల గౌరవం ఉంటే వెంటనే స్పందించాలంటూ స్విగ్గీని ట్యాగ్ చేస్తూ చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు.