UP Civic Body Meet:
కౌన్సిల్‌లో కుస్తీ..
యూపీలో ఓ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్‌లో రెజ్లింగ్ మ్యాచ్ జరిగింది. కౌన్సిల్‌లో కుస్తీ పోటీలేంటని అనుమానం రావచ్చు..కానీ నిజంగా అదే జరిగింది. కార్పొరేషన్ సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు విసురుకున్నారు. కుర్చీలతో దాడులు చేసుకున్నారు. దెబ్బల ధాటిని తట్టుకోలేక కొందరు టేబుల్‌ని అడ్డంగా పెట్టుకున్నారు. ఓ సభ్యుడైతే చైర్ ఎక్కి మరో వ్యక్తిపై దూకేందుకు ప్రయత్నించాడు. చాలా సేపటి వరకూ సమావేశంలో గందరగోళం నెలకొంది. Shamli Municipal Council మీటింగ్‌లో ఈ గొడవ చోటు చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఈ గొడవనంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్కసారిగా ఇది వైరల్ అయిపోయింది. ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలు పెట్టాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ వీడియోని షేర్ చేశారు. బీజేపీపై మండి పడ్డారు. పరిపాలనా యంత్రాంగం ఎలా పని చేస్తోందో చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ అంటూ సెటైర్లు వేశారు. బీజేపీలో లుకలుకలున్నాయని ఆరోపించారు.
"అసలు అభివృద్ధే జరగనప్పుడు కౌన్సిల్ రివ్యూ మీటింగ్‌లో ఇంత కన్నా ఏం జరుగుతుంది..? సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బీజేపీ పరిపాలన ఎలా ఉంటుందో చెప్పడానికే ఇదే మంచి ఉదాహరణ. ఇకపై సభ్యులు సొంతగా సెక్యూరిటీని పెట్టుకుని సమావేశానికి రావాలేమో"
- అఖిలేష్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి