Viral News: జీవితంలో ఒక్కసారి అయినా విమానం ఎక్కాలని చాలా మంది అనుకుంటుంటారు. కొంతమంది వందల సార్లు, మరికొంత మంది పదుల సంఖ్యలో ఫ్లైట్ లలో తిరుగుతుంటారు. తమ ఆర్థిక స్థోమతని బట్టి వివిధ క్లాసుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రత్యేక విమానంలో అయితే ఒకరూ, ఇధ్దరు వెళ్లొచ్చు కానీ.. ప్యాసింజర్ విమానంలో వందలాది మంది ఉంటారు. కానీ ప్యాసింజర్ ఫ్లైట్ లో వెళ్లాలనుకున్న ఓ సామాన్యుడికి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. అతనికి తెలియకుండానే ఓ విమానంలో ఏకైక ప్రయాణికుడిగా లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. పోర్చుగల్ నుంచి ఉత్తర ఐర్లాండ్ లోని తన కుటుంబాన్ని చూడడానికి విమానం ఎక్కిన అతడికి ఈ ఊహించని పరిణామం ఎదురైంది.






విమానం ఎక్కేందుకు వెళ్లిన ఆ వ్యక్తికి ఎవరూ కనిపించలేదు. తానొక్కడినే ప్రయాణికుడిని అని తెలుసుకొనిన ఆశ్చర్యపోయాడు. 65 ఏళ్ల పాల్ విల్కిన్సన్ తన దేశం పోర్చుగల్ నుంచి ఐర్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. సమయానికి ఎయిర్ పోర్టుకు కూడా వెళ్లాడు. కానీ అతడు వెళ్లే సరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. దీంతో పాల్.. ఫ్లైట్ మిస్సయిందా లేక రద్దు అయిందా అనుకొని సిబ్బందిని అడిగాడు. అదేం లేదు మీరు సయానికే వచ్చారు.. కాకపోతే ఫ్లైట్ లో ప్రయాణించబోయేది మీరు ఒక్కరే అని సిబ్బంది చెప్పారు. అలాగే ఇది మీ వ్యక్తిగత విమానం అనుకోండని.. ఈరోజు మీరే మా వీఐపీ అని చెప్పినట్లు విల్కిన్సన్ వెల్లడించారు.


ముందు వాళ్లు కావాలని జోక్ చేస్తున్నారే అనుకున్న పాల్.. ఫ్లైట్ ఎక్కకా అదే నిజం అని నమ్మక తప్పలేదు.  ఆ ఫ్లైట్ లో తాను తప్ప మరెవరూ లేరు. సీట్లన్నీ ఖాళీగా దర్శనం ఇచ్చాయి. దీంతో పాల్ తనకు నచ్చిన సీట్లు కూర్చున్నట్లు చెప్పాడు. సిబ్బంది కూడా ఒక్కడే ప్రయాణికుడు ఉండడంతో... నిజంగానే వీఐపీలా చూసుకున్నారట. విల్కిన్సన్ కేవలం 162 డాలర్లు అంటే 13 వేలకే 3 గంటల పాటు నచ్చినట్లుగా ప్రయాణం చేశారు. అలాగే అతను విమానం దిగిన తర్వాత పాస్ పోర్ట్ చెక్ ఏజెంట్లు కూడా పాల్ విల్కిన్సన్ ను చూసి ఆశ్చర్యపోయారట. కానీ ప్రయాణికుడు ఒక్కడే వచ్చినట్లు తెలుసుకొని సంతోషంగా ప్రాసెస్ పూర్తి చేసి అతడిని పంపించారు.