Viral News: ప్రపంచంలో అప్పుడప్పుడూ కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అందులో ఇది కూడా ఒకటి. తాజాగా ఉగాండాలో ఓ రెండేళ్ల బాలుడ్ని నీటి గుర్రం (హిపోపాటమస్) అమాంతం మింగేసింది. కానీ ఆ బాలుడు చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎలా అంటే?


ఇదీ జరిగింది


ఉగాండాలో సరస్సుకు సమీపంలో ఓ రెండేళ్ల చిన్నారి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వాడి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. అయితే సరస్సు నుంచి వచ్చిన నీటి గుర్రం బాలుడ్ని తలపై నుంచి అమాంతం మింగేసింది. సగానికిపైగా శరీరాన్ని నోట్లోకి తీసుకుంది. అయితే అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి గట్టిగా అరిచాడు. ఆ నీటి గుర్రంపైకి రాళ్లు విసిరాడు.


దీంతో అది బాలుడ్ని వదిలేసింది. కానీ హిపోపాటమస్ పళ్లు గుచ్చుకొని చిన్నారి చేతికి గాయాలయ్యాయి. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా వైద్యులు ముందు జాగ్రత్తగా రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం చికిత్స అందించారు. అయితే చిన్నారికి ఎలాంటి అపాయం లేదని తెలిపారు.


శాకాహారులే కానీ


నీటిగుర్రాలు శాఖహారులే.. అయినా కూడా బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్ కూడా ఒకటి. దీని దంతాలు చాలా బలంగా ఉంటాయి.