Viral News:
ఎమోషనల్ లెటర్..
క్రిస్మస్ వచ్చేస్తోంది. పెద్దలంతా పండుగ ఏర్పాట్లు చేసుకుంటుంటే..పిల్లలు మాత్రం శాంతాక్లాజ్ గిఫ్ట్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. చాక్లెట్లు, బిస్కెట్‌లు, ఆట బొమ్మలు తెస్తే బాగుండని కోరుకుంటారు. సీక్రెట్ శాంటా పేరుతో సర్‌ప్రైజ్‌లూ అందుకుంటారు చిన్నారులు. అందుకే..ఈ పండుగంటే అంతగా ఇష్టపడతారు. శాంటాకు లెటర్ రాస్తే ఆ కోరికలు తీరిపోతాయని నమ్ముతారు. కానీ...ఓ 8 ఏళ్ల చిన్నారి మాత్రం ఇవేమీ కోరుకోలేదు. ఆ చిన్నారి శాంటాకు రాసిన లెటర్‌ని చదివితే కళ్లు చెమర్చక మానవు. యూకేలోని ఓ మహిళ తన ట్విటర్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. ఓ చిన్నారి శాంటాకు రాసిన లెటర్ అది. "ఇప్పుడే మా చెల్లెలికి ఈ ఉత్తరం దొరికింది. ఇది చదివినంత సేపూ కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను" అంటూ ట్వీట్ చేసింది. తనకు గిఫ్ట్‌లు అడగటానికి బదులు ఆ చిన్నారి తన తల్లిదండ్రులకు సాయం చేయాలని అడిగింది. "బిల్స్, లోన్స్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు" అని చెప్పింది. "డియర్ శాంటా. నేను ఈ క్రిస్మస్‌కి కోరుకునేది ఒకటే. మా అమ్మ, నాన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లకు డబ్బు అవసరం ఉంది. అదే ఇచ్చేయండి. నాకు చాలా బాధగా ఉంది. ప్లీజ్..ఇది ఆ డబ్బు మీరు ఇవ్వగలరా..? ఇది చాలా పెద్ద కోరిక అని తెలుసు. కానీ ఏం చేయలేను సారీ" అని లెటర్‌లో రాసింది. ఈ చిన్నారి ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు. "ఇంత చిన్న పిల్లకు అంత పెద్ద ఆలోచన ఎలా వచ్చిందబ్బా"అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను ట్యాగ్ చేస్తూ ఈ చిన్నారికి సాయం కావాలని కోరుతున్నారు. మొత్తానికి ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.