Shakunthala - BRS Party: ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. దేశ గతిని మార్చే సత్తా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కే ఉన్నాయని అన్నారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రితో పాటు పలువురు మైనార్టీ నాయకులు బీఆర్ఎ లో చేరారు. పార్టీలో చేరిన వారికి తోట చంద్రశేఖర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ నుంచి వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్లు ఎంతో మంది బీఆర్ఎస్ లోకి చేరేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. దేశం గుణాత్మక మార్పు చెందాలని, ఉజ్వల భారతం కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అద్భుత రోడ్ మ్యాప్ ను రూపొందించారని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి అతిస్వల్ప కాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి రోల్ మాడల్ గా తీర్చిదిద్దారని తెలిపారు. అదే స్ఫూర్తితో ఏపీతోపాటు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. 


పవన్ కల్యాణ్ కు ఆఫరిచ్చిందని వస్తున్న వార్తలు 


ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రూ.వెయ్యి కోట్ల ఆఫర్ ఇచ్చారన్న ప్రచారాన్ని తోట చంద్ర శేఖర్ ఖండించారు. ఇలా ప్రచారం చేస్తున్న వారి దిగజారుడుతనానికి అద్దం పడుతుందని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పొత్తులు ఏ పార్టీతో అయినా పెట్టుకోవచ్చని అన్నారు.పొత్తు మేము పెట్టుకుంటే సంసారం ఇతరులు పెట్టుకుంటే వ్యభిచారం అన్నట్టు మాట్లాడడం సరికాదని అన్నారు. పొత్తు కోసం కేసీఆర్ డబ్బు ఆఫర్ చేశారని అభియోగాలు చేయడం వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసినట్టు అవుతుందని దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకుల నిర్లక్ష్యం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. దేశంలో రైతాంగ సమస్యలను ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదని అన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టమని బి అర్ ఎస్ పార్టీ అన్నీ రాష్ట్రాలలో విస్తరిస్తుందని అన్నారు. ముఖ్యమైన రైతాంగ సమస్యల పై బిఆర్ఎస్ దృష్టి పెడుతుందని అన్నారు.నిరుద్యోగం,ధరల నియంత్రణ లేకపోవడం ప్రధానంగా ఉన్నా సమస్యలని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విభజన హామీలను సాధించుకోవాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనలో వైసిపి,టిడిపి పార్టీలు విఫలం అయ్యాయిని అన్నారు.పెద్ద పార్టీల లీడర్ల ను అవహేళన చేసే అభియోగాలు మోపడం తగదని అన్నారు.


బీఆర్ఎస్‌తో  కలిసి పోటీ చేసే  విషయంపై పవన్ కల్యాణ్‌ను కొంత మంది బీఆర్ఎస్ ప్రతినిధులు కలిసి ప్రాథమికంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఏపీ రాజకీయాలు ఎన్నికల తర్వాత ఎలా మారతాయి. బీఆర్ఎస్ , పవన్ కల్యాణ్ కలిస్తే ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఏర్పడతాయి అన్నవాటిపై లోతైన పరిశీలనతో... బీఆర్ఎస్ ప్రతినిధులు పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇది మొత్తం బీఆర్ఎస్ వైపు నుంచి ఏపక్షంగా జరుగుతోంది కానీ పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎలాంటి ఆసక్తి చూపించలేదని చెబుతున్నారు.