Vijayawada: బర్త్ డే పార్టీకి వెళ్లాడు, కాలిపోయిన శవంలా మారాడు - అసలేం జరిగిందంటే?
Vijayawada: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బర్త్ డే పార్టీకి అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువుకుడు కాలిపోయిన స్థితిలో మృతదేహంగా కనిపించాడు.
Krishna District News: కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెనమలూరులోని పెద్దపులిపాక గ్రామంలో.. కాలిపోయిన స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యం అయింది. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడు విజయవాడకు చెందిన 22 ఏళ్ల జీవన్ గా గుర్తించారు. పొట్టి శ్రీరాములు కాలేజీలో జీవన్ బీటెక్ చదువుతున్నాడు. నిన్న సాయంత్రం బర్త్ డే పార్టీ ఉందని ఇంటి నుంచి వెళ్లిన ఇతడు.. ఇలా శవంగా మారాడని తెలియడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉందనుకున్న కొడుకు ఇలా కాలిపోయిన స్థితిలో శవంగా దొరకడం ఏంటని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పుట్టిన రోజుకు వెళ్తున్నానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ జీవన్ తల్లి ఏడవడం అందరినీ కలిచి వేసింది. ఎవరైనా హత్య చేశారా, లేక మరోదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జీవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదేరోజోజు పల్నాడు జిల్లా రెండు వేర్వేరు చోట్ల మృతదేహాలు లభ్యం
పల్నాడు జిల్లా నరసారావుపేట పట్టణంలో వేర్వేరు చోట్ల రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతదేహాలను ముందుగా గుర్తించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నర్సారావుపేట గాంధీ పార్కు సమీపంలో గుర్తు తెలియంని వ్యక్తి మృత దేహం దొరకగా... స్టేషన్ రోడ్ లో వరంగల్ కు చెందిన మరో వ్యక్తి మృతదేహాం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మృతి చెందిన ఇద్దరూ అనుమానాస్పద రీతిలో చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇరువురి దేహాలపై తీవ్రమైన రక్త గాయాలు ఉన్నాయి. విచక్షణా రహితంగా తలపై బండ రాయితో దాడి చేసి చంపేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు.. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. స్టేషన్ రోడ్ లో మృతి చెందిన వ్యక్తి వరంగల్ జిల్లాకు చెందిన కరివిదుల సంపత్ రెడ్డిగా గుర్తించారు. గాంధీ పార్క్ వద్ద మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు.
గతంలో గుంటూరులో కూడా ఇలాంటి ఘటనే..!
అయితే రెండు నెలల క్రితం కూడా ఇదే విధమైన దాడి గుంటూరు లో జరిగింది. అరండాలపేట లిక్కర్ మాల్ వద్ద, ఇన్నర్ రింగ్ రోడ్డులోని భైక్ షోరూం వద్ద నైట్ వాచ్ మెన్లపై దాడి చేశారు. ఆ దాడిలో ఇద్దరు వాచ్ మెన్లు మృతి చెందారు. అదే తరహాలో ఇక్కడ కూడా దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దాడిని బేస్ చేసుకొని గంజాయి బ్యాచ్ లు ఈ విధంగా హత్య చేశరా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ ఘటనతోనైనా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.