Vande Bharat Express Mumbai:


ముంబయి నుంచి రెండు రైళ్లు..


ప్రధాని నరేంద్ర మోదీ మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ముంబయి-సోలాపూర్‌, ముంబయి-సాయినగర్ షిరిడీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతో పాటు డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు. ఇదే క్రమంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. రైల్వేలో వందేభారత్ రైళ్లు కొత్త శకానికి నాంది పలికాయని అన్నారు మోదీ. ఈ రైళ్లు నవభారత్‌కు ప్రతీక అన్న ఆయన..17 రాష్ట్రాల్లోని 108 జిల్లాలు ఈ రైళ్ల ద్వారా అనుసంధానమవుతాయని చెప్పారు. ఇకపై ముంబయి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగా ప్రయాణించొచ్చని అన్నారు. ముంబయి, పుణె లాంటి ఆర్థిక కేంద్రాలను అనుసంధానించడం వందేభారత్‌ రైళ్లతో సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (CSMT) నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. అత్యంత వేగంగా వందేభారత్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకూ మొత్తంగా 10 రైళ్లను లాంఛ్ చేసింది కేంద్రం. ప్రజారవాణా వ్యవస్థలో అత్యంత వేగంగా మార్పులు రావాల్సిన అవసరముందని అన్నారు ప్రధాని. తద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 


"గతంలో ఎంపీలు తమ నియోజకవర్గాల్లో రైళ్లు కనీసం 1-2 నిముషాలు ఆగేలా చొరవ తీసుకోవాలని లేఖ రాసేవారు. కానీ ఇప్పుడు వాళ్లను ఎప్పుడు కలిసినా తమ నియోజకవర్గాల్లోకి వందేభారత్ ట్రైన్స్ వచ్చేలా చూడండని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ట్రైన్స్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది" 


-ప్రధాని నరేంద్ర మోదీ