Army Deployed At Uttarakhand Gurdwara: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల మార్గంలో ఉన్న నాగ్రాసు గురుద్వారా  ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది. ఈటెలు, ఖడ్గాలు, గొడ్డళ్లు వంటి మారణాయుధాలతో గురుద్వారాలోకి దూసుకెళ్లిన నిహాంగ్ సిక్కుల బృందం, అక్కడ సృష్టించిన హైడ్రామా మంగళవారానికి నాలుగో రోజుకు చేరింది. చమోలి ఘర్షణల వల్ల  తమ వర్గానికి చెందిన నలుగురి అరెస్ట్‌కు నిరసనగా ఈ బృందం గురుద్వారా మూడో అంతస్తును తమ ఆధీనంలోకి తీసుకుని నిరసన తెలుపుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి స్థానిక పోలీసులతో పాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ,  ఏకంగా సైన్యం రక్షణ రంగంలోకి దిగడం జాతీయస్థాయిలో సంచలనంగా మారింది.

Continues below advertisement

శ్రీ హేమకుండ్ సాహిబ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న నిహాంగ్ సిక్కుల బృందానికి, జూన్ 16న చమోలి జిల్లా కర్ణప్రయాగ మార్కెట్‌లోని ఒక హోటల్ సమీపంలో పార్కింగ్ విషయమై స్థానికులతో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నలుగురు స్థానికులు గాయపడటంతో.. చమోలి పోలీసులు   యాక్షన్ తీసుకుంటూ నలుగురు నిహాంగ్ సిక్కులను అరెస్ట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అరెస్టులపై నిరసన తెలపడానికి నాగ్రాసు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ను ఆశ్రయించిన సుమారు ఎనిమిది మంది నిహాంగులు.. శనివారం ఒక్కసారిగా గురుద్వారాపై దాడి చేసి, ఒక భక్తుడిని ,  ఒక సేవకుడిని  మూడో అంతస్తులో బందీలుగా చేసుకున్నారు.

ఈ సంక్షోభం తీవ్రం కావడంతో జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలు రంగంలోకి దిగి నిహాంగులతో చర్చలు జరిపారు. ఫలితంగా శనివారం భక్తుడిని, ఆదివారం సాయంత్రానికి సేవకుడిని క్షేమంగా విడిపించారు. అయితే, గురుద్వారా   ప్రధాన పూజారి  బాబా బీంత్ సింగ్ ఈ నిహాంగ్ బృందంపై తీవ్ర ఆరోపణలు చేశారు.  యాత్రికులుగా వచ్చిన వారికి ఆశ్రయం కల్పించి, రాత్రి భోజనం పెడితే.. మరుసటి రోజు ఉదయం నుంచే వాలంటీర్లపై దాడులు చేస్తూ, బూతులు తిడుతూ హింసకు దిగారు  అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా గురుద్వారా వాటర్ సప్లై కట్ చేశారని, సోలార్ ప్యానెళ్లను ధ్వంసం చేస్తూ, పోలీసులపైకి, స్థానికులపైకి రాళ్లు రువ్వారని ఆయన ఆరోపించారు.

Continues below advertisement

ఈ ఉద్రిక్తతల కారణంగా రుద్రప్రయాగ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 12 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. వదంతులు వ్యాపించకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకున్న ఈ నిర్ణయం.. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటర్నెట్ బ్యాన్ చేయడం ఇది కేవలం మూడోసారి మాత్రమే కావడం ఇక్కడి తీవ్రతను సూచిస్తోంది. సోమవారం నాటికి ఆర్మీ బలగాలు కూడా పట్టణానికి చేరుకోవడంతో గురుద్వారా వెలుపల భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.  

ప్రస్తుతం గురుద్వారా లోపల ఉన్న నిహాంగులను శాంతింపజేయడానికి మరియు అధికారుల ఆదేశాలకు లోబడేలా చేయడానికి సిక్కు సమాజానికి చెందిన మరికొందరు నిహాంగ్ పెద్దలు రాయబారానికి వచ్చారు. వారి మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతానికి గురుద్వారా లోపల, వెలుపల పరిస్థితి ప్రశాంతంగానే ఉందని సమాచార సంస్థ ANI తెలిపింది. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచినట్లు, నేషనల్ హైవేపై ట్రాఫిక్ రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సాధారణంగానే సాగుతోందని యంత్రాంగం స్పష్టం చేసింది.