Global Capability Centres India GCC:  ఎన్నో దశాబ్దాలుగా నడిచిన  బ్రెయిన్ డ్రెయిన్ ధోరణి తిరగబడి, భారతదేశం వైపు రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ శరవేగం అవుతోంది. అమెరికాలోని ప్రముఖ గ్లోబల్ ఐటీ ,  టెక్నాలజీ కంపెనీలలో పనిచేస్తున్న వైట్-కాలర్ నిపుణులు భారీ సంఖ్యలో తిరిగి భారతదేశానికి బాటపడుతున్నారు. స్టాఫింగ్ సంస్థల గణాంకాల ప్రకారం 2026 మొదటి తొమ్మిది నెలల్లోనే దాదాపు 12,700 మంది వైట్-కాలర్ టెక్ నిపుణులు అమెరికాను వదిలి భారత్‌కు చేరుకున్నారు. 2023లో 7,200 మంది, 2024లో 9,800 మంది,  2025లో రికార్డు స్థాయిలో 15,100 మంది స్వదేశానికి రాగా, ఈ ఏడాది ఆ సంఖ్య పాత రికార్డులన్నింటినీ తిరగరాసే దిశగా సాగుతోంది. అమెరికాలో దశాబ్దాల తరబడి ఉన్న అమెరికన్ డ్రీమ్  కంటే సొంత గడ్డపై పెరుగుతున్న అవకాశాలే మిన్న అని భావించి వీరంతా హైదరాబాద్, బెంగళూరు, పూణే, గుర్గావ్ వంటి ప్రధాన భారతీయ టెక్ నగరాల్లో రీ-ఎంట్రీ ఇస్తున్నారు.

Continues below advertisement

అమెరికాలో భవిష్యత్ పై నమ్మకం కోల్పోతున్న ఎన్నారైలు

ఈ భారీ వలస వెనుక ప్రధాన కారణం అమెరికాలో హెచ్-1బి  వీసా విధానాలపై వ్యక్తమవుతున్న నిరంతర అనిశ్చితి. వీసా నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డ్  కోసం దశాబ్దాల తరబడి నిరీక్షించాల్సి రావడం,  వీసా సకాలంలో రీ-న్యూవల్ కాకపోతే ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు భారతీయులలో తీవ్ర అభద్రతాభావాన్ని పెంచాయి. దీనికి తోడు అమెరికా టెక్ దిగ్గజాల్లో వరుస లేఆఫ్స్  సంభవించినప్పుడు హెచ్-1బి హోల్డర్లకు లభించే 60 రోజుల గ్రేస్ పీరియడ్ లోపు కొత్త ఉద్యోగం వెతుక్కోవడం తీవ్ర సవాలుగా మారింది. ఉద్యోగం పోయిన వెంటనే దేశం వీడాల్సిన కఠిన పరిస్థితుల కంటే, సురక్షితమైన సొంత దేశంలో స్థిరపడటమే మంచిదని మెజారిటీ నిపుణులు నిర్ణయించుకుంటున్నారు.

Continues below advertisement

 భారతదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విస్తరణ  

రెండో ప్రధాన కారణం.. భారతదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు  అత్యంత వేగంగా విస్తరించడం. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ 500 కంపెనీలు, మల్టీ నేషనల్ టెక్ దిగ్గజాలు తమ ప్రధాన పరిశోధన,  ఇంజనీరింగ్ కేంద్రాలను హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. కేవలం సపోర్ట్ ప్రాజెక్టులు కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , జనరేటివ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ వంటి అత్యాధునిక రౌండ్-ది-క్లాక్ ప్రాజెక్టులను భారత్ నుంచే నిర్వహిస్తున్నాయి. అమెరికాలో సంపాదించే స్థాయికి దగ్గరగా ప్యాకేజీలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ హోదాలు ఇక్కడే లభిస్తుండటంతో గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఉన్న నిపుణులకు జిసిసిలు ప్రధాన వేదికగా మారాయి.

ఇండియాలో అయితే కుటుంబానికి దగ్గరగా!

అంతేకాకుండా, మారుతున్న జీవనశైలి ,  కుటుంబ కారణాలు కూడా ఈ నిర్ణయంలో బలమైన పాత్ర పోషిస్తున్నాయి. సుదీర్ఘకాలం అమెరికాలో గడిపిన భారతీయ నిపుణులు తమ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ, పిల్లల సాంస్కృతిక ఎదుగుదల ,  సొంత సామాజిక వాతావరణంలో జీవించాలనే కోరికతో తిరిగొస్తున్నారు. భారత్‌లో డిజిటల్ మౌలిక వసతులు, ప్రపంచస్థాయి గేటెడ్ కమ్యూనిటీలు, అంతర్జాతీయ పాఠశాలలు అందుబాటులోకి రావడంతో యూఎస్ తరహా జీవన ప్రమాణాలను ఇక్కడే పొందగలుగుతున్నారు. దీనికి తోడు భారతదేశంలో స్టార్టప్ ఇకోసిస్టమ్ బలంగా పుంజుకోవడంతో, అమెరికా అనుభవంతో సొంతంగా స్టార్టప్‌లు ప్రారంభించేందుకు విదేశీ నిపుణులు ముందుకు వస్తున్నారు.  

అమెరికాతో పోలిస్తే వేతనాలు చాలా తక్కువ   

భారత్‌కు తిరిగి రావడం పూర్తిగా సునాయాసంగా ఏమీ లేదు. అమెరికా స్థాయి జీతాలతో పోలిస్తే భారత మార్కెట్‌లో వేతనాల సర్దుబాటు  చేసుకోక తప్పడం లేదు. అంతేకాకుండా, ఇక్కడి కార్పొరేట్ వర్క్ కల్చర్, ట్రాఫిక్ సమస్యలు, నైపుణ్యాలకు తగిన సరైన ఉద్యోగ ఎంపికలో ఎదురయ్యే పోటీ వంటి సవాళ్లను వారు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినప్పటికీ, ఉద్యోగ భద్రత , స్వదేశంలో ఉండే మానసిక ప్రశాంతత ముందు ఈ ఆర్థిక వ్యత్యాసాలు చిన్నవిగా కనిపిస్తున్నాయని తిరిగొచ్చిన నిపుణులు చెబుతున్నారు.  అమెరికా నుంచి అత్యున్నత సాంకేతిక అనుభవం, ఆవిష్కరణల ఆలోచనలు ఉన్న నిపుణులు భారత్‌కు తరలిరావడం దేశ ఆర్థిక వ్యవస్థకు, వికసిత్ భారత్ లక్ష్యాలకు పెద్ద ఊతాన్నిస్తుంది. గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో భారత్ కేవలం  సేవల కేంద్రం గానే కాకుండా లీడర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ హబ్ గా రూపాంతరం చెందడానికి ఈ రివర్స్ మైగ్రేషన్ దోహదపడుతోంది. రాబోయే ఏళ్లలో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య కంటే విదేశాల నుంచి భారతదేశానికి తిరిగొచ్చే ఐటీ నిపుణుల సంఖ్యే అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదని మైగ్రేషన్ డేటా స్పష్టం చేస్తోంది.