US Supreme Court strikes down Trump global tariffs:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీకాలంలో ప్రపంచవ్యాప్త దిగుమతులపై విధించిన భారీ టారిఫ్స్‌ను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వాడే  ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ను ఉపయోగించి అధ్యక్షుడు ఏకపక్షంగా ఇలాంటి పన్నులు విధించడానికి వీల్లేదని 6-3 మెజారిటీతో కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ ఆర్థిక ఎజెండాలో అత్యంత కీలకమైన ఈ విధానాన్ని న్యాయస్థానం తప్పుబట్టడం ఆయన పరిపాలనకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.    

Continues below advertisement

 అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్స్ లేదా పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కు  అంటే పార్లమెంటు మాత్రమే ఉంటుందని, ఆ అధికారాన్ని అధ్యక్షుడు తన చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. 1977 నాటి అత్యవసర చట్టం అనేది ఆంక్షలు లేదా విదేశీ ఆస్తుల స్తంభన వంటి చర్యలకే పరిమితమని, దీనిని అడ్డుపెట్టుకుని అన్ని దేశాల వస్తువులపై పన్నులు వేయడం ఆ చట్టం ఉద్దేశం కాదని న్యాయమూర్తులు వివరించారు. ఈ తీర్పుతో గత కొంతకాలంగా ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. 

Continues below advertisement

 ట్రంప్ విధించిన ఈ పన్నుల వల్ల అమెరికాలోని వ్యాపార సంస్థలు, వినియోగదారులపై దాదాపు  200 బిలియన్ డాలర్ల అదనపు భారం పడిందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. కేవలం విదేశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ టారిఫ్స్ వల్ల అమెరికాలోనే ద్రవ్యోల్బణం పెరిగిందని సర్వేలు వెల్లడించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటివరకు వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, దీనివల్ల స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోర్టు తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం టారిఫ్స్ అత్యవసరమని, ఇది అమెరికాకే నష్టమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు కేవలం ఎమర్జెన్సీ చట్టం కింద విధించిన పన్నులకే వర్తిస్తుంది. ఇతర చట్టాల ద్వారా  నిర్దిష్ట వస్తువులపై టారిఫ్స్ వేసే అవకాశం ఇంకా అధ్యక్షుడికి ఉంది. ఈ  క్రమంలో ట్రంప్ ప్రభుత్వం మరిన్ని న్యాయపరమైన ప్రత్యామ్నాయాలను అన్వేషించే అవకాశం కనిపిస్తోంది.