UK US Tea Controversy: రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలు జరగడం చూశాం. వాణిజ్యంలో ఏదైనా తేడా జరిగి ఘర్షణ పడడమూ చూశాం. కానీ...టీ విషయంలో అమెరికా, బ్రిటన్ మధ్య వాగ్వాదం మొదలైంది. వినడానికి చాలా వింతగా అనిపిస్తున్నా ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇదంతా ఓ సైంటిస్ట్‌ వల్ల వచ్చిన తంటా. టీలో ఉప్పు వేసుకుని తాగొచ్చు అంటూ ఓ అమెరికన్ సైంటిస్ట్ (US scientist tea recipe) ఇచ్చిన సలహా బ్రిటన్‌ని తీవ్ర అసహనానికి గురి చేసింది. అంతే కాదు. టీ తయారు చేయడంలో ఇదే పర్‌ఫెక్ట్ రెసిపీ అంటూ తనకు తానే కాంప్లిమెంట్స్ ఇచ్చుకున్నారు. కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ చెప్పిన ఈ రెసిపీయే రెండు దేశాల మధ్య మంట పెట్టింది. ప్రపంచంలో టీ ఎక్కువగా వినియోగించే దేశాల్లో యూకే ముందు వరసలో ఉంటుంది. టీలో ఉప్పు వేసుకుని తాగొచ్చు అని అలా ఆ సైంటిస్ట్ చెప్పారో లేదో వెంటనే మండి పడింది యూకే. తమ అభిరుచిని ఇది అవమానించినట్టుగా ఉంది, తమ అలవాట్లను కించపరిచినట్టుగా ఉందని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. లండన్‌లోని యూఎస్ ఎంబసీ మాత్రం ఈ వివాదంపై స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదు. కానీ...ఆ సైంటిస్ట్ డాక్టర్ ఫ్రాంక్ల్‌ మాత్రం తన రెసిపీ చాలా మంచిదని చెబుతున్నారు. అంతే కాదు. టీ తయారు చేసే విధానాలపై ఎంతో అధ్యయనం చేశానని వివరిస్తున్నారు. పైగా వెయ్యేళ్ల క్రితం నాటి పుస్తకాలనీ తిరగేసి చివరకు ఈ రెసిపీ కనుగొన్నట్టు చెబుతున్నారు. 




ఇదీ గొడవ..


Steeped: The Chemistry of Tea అనే పుస్తకం రాశారు. అందులోనే ఈ రెసిపీ గురించి ప్రస్తావించారు. టీలో కొంత చేదు ఉంటుందని,ఆ చేదు పోవాలంటే కొంత ఉప్పు వేసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. పాలను వేడి చేసుకుని టీ తయారు చేసుకున్నాక..తాగే ముందు మరి కొన్ని పాలు టీలో పోసుకోవాలని సూచించారు. పెద్ద గిన్నెల్లో కాకుండా చిన్న చిన్న పాత్రల్లో టీ తయారు చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. అంతే కాదు. టీ బ్యాగ్‌ల కన్నా తేయాకులనే వినియోగిస్తే ఆ టేస్ట్ అదిరిపోతుందంటూ సలహా ఇచ్చారు. టీ కప్పులో పోసుకున్న తరవాత పైన కొంత నురగ వస్తుందని, టీ పౌడర్‌లో రసాయనాలు కలపడం వల్లే అలా జరుగుతుందని వివరించారు సైంటిస్ట్. ఇలా జరగకుండా ఉండాలంటే కొంత నిమ్మరసం పిండుకోవాలని సలహా ఇచ్చారు. టీ అంటే పడి చచ్చే బ్రిటన్ మాత్రం దీనిపై తీవ్రంగా మండి పడింది. ఇదేం రెసిపీ అంటూ పెదవి విరిచింది. బ్రిటన్‌లో టీని నేషనల్ డ్రింక్‌గా ఇప్పటికే ప్రకటించారు. అంతగా వాళ్లకి, తేనీటికి అవినాభావ సంబంధం ఉంది. దీనిపై యూఎస్ ఎంబసీ స్పందించింది. ఈ వివాదం వల్ల అమెరికా, యూకే మధ్య బంధం వేడినీళ్లలో పడినట్టైందంటూ విచారం వ్యక్తం చేసింది. సాధారణంగా బ్రిటన్‌లో కెటిల్స్‌లో టీ తయారు చేసుకుంటారు. వాటిలో కాకుండా వేరే విధంగా తయారు చేసుకోవాలని చెప్పడమే వాళ్లని కొంత అవమానపరిచినట్టుగా ఫీల్ అయ్యారు. మొత్తానికి రెండు దేశాల మధ్య తేనీటి వివాదం ముదురుతోంది. 


Also Read: China Earthquake: చైనాలో మళ్లీ భూ ప్రకంపనలు, 5.2 తీవ్రతతో కంపించిన భూమి