Union Cabinet allot semiconductor unit to AP: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలకమైన గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా నాలుగు సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయాలనుకుంది. ఆ నాలుగింటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఒడిశా, పంజాబ్‌లకు కూడా కేటాయించారు.అలాగే లక్నో మెట్రోకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.                     

భారత సమాచార మరియు సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్   మొత్తం 45.94 బిలియన్ రూపాయల పెట్టుబడితో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు ఒడిశా, పంజాబ్,   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్థాపిస్తారు.  భారతదేశ సెమీకండక్టర్ ఉత్పాదన వ్యవస్థను బలోపేతం చేయడానికి ,  గ్లోబల్ చిప్  సప్లై చైన్‌లో భారతదేశ స్థాన స్థానాన్ని  పటిష్టం చేయాడనికి ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం నాలుగు యూనిట్లలో రెండు  రెండు సెమీకండక్టర్ యూనిట్లు ఒడిశాలోనే పెడుతున్నారు.             

ఈ యూనిట్లు  కాంపౌండ్ సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ యూనిట్లు పై దృష్టి సారిస్తాయి.  ఇవి భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదన వ్యవస్థకు కీలకమైనవి. కాంపౌండ్ సెమీకండక్టర్లు గాలియం ఆర్సెనైడ్ లేదా సిలికాన్ కార్బైడ్ వంటి పదార్థాలను ఉపయోగిస్తాయి.  ఇవి హై-పవర్ ఎలక్ట్రానిక్స్, 5G,  ఎలక్ట్రిక్ వాహనాల వంటి అధునాతన సాంకేతికతలకు అవసరం. మంత్రి అశ్వినీ వైష్ణవ్ సెమీకండక్టర్లను "ఫౌండేషనల్ ఇండస్ట్రీ"గా అభివర్ణించారు, ఇవి లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందినదిగా చెప్పలేమన్నారు.                     

ఈ ప్రాజెక్టులు 2021 డిసెంబర్‌లో 76,000 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రారంభించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)లో భాగంగా ఉన్నాయి.   సెమీకండక్టర్ ఉత్పాదన, డిజైన్, మరియు R&Dని ప్రోత్సహించడం.  చిప్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం. దేశీయ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడం మరియు నైపుణ్యం గల శ్రామిక శక్తిని సృష్టించడం లక్ష్యంగా ఈ మిషన్ ప్రారంభించారు. 

ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, అస్సాం, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు సెమీకండక్టర్ పెట్టుబడులను ఆకర్షించడానికి సబ్సిడీలు, భూమి కేటాయింపు, మరియు మౌలిక సదుపాయాలను అందిస్తున్నాయి.భారతదేశం 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఎదిగే లక్ష్యంతో సెమీకండక్టర్ యూనిట్లలో పెట్టుబడులు పెడుతోంది.