Union Budget 2023: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సాధారణ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో 2023సంవత్సరానికి చెందిన పూర్తి స్థాయి బడ్జెట్‌ పార్లమెంట్‌ ముందుకు రానుంది. అయితే ఈ బడ్జెట్ పై అన్ని వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. మరి ఆర్థికమంత్రి మురిపిస్తారో, ఉసూరుమనిపిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రజాకర్షక ప్రకటనలు చేయవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే.. దేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బడ్జెట్ ప్రవేశ పెట్టని, అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ మంత్రులు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

స్వతంత్ర భారతదేశం మొదటి బడ్జెట్ ను 1947వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన సమర్పించారు. భారత దేశపు మొదటి బడ్జెట్ గురించి మాట్లాడితే... అది బ్రిటిష్ కాలంలో ప్రారంభమైంది. భారతదేశం మొదటి బడ్జెట్ ను 1860వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన బ్రిటన్‌లో ప్రవేశ పెట్టారు. అలాగే ఆ బడ్జెట్ ఆమోదించింది కూడా. అప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఫైనాన్స్‌ సభ్యుడు జేమ్స్ విల్సన్. 

ఒక్కసారి కూడా బడ్జెట్ ప్రవేశ పెట్టని ఆర్థిక మంత్రిగా కేసీ నియోగి

స్వతంత్ర భారత బడ్జెట్ గురించి మాట్లాడితే.. ఇప్పటి వరకు బడ్జెట్‌ను సమర్పించలేని ఆర్థిక మంత్రి ఒక్కరే ఉన్నారు. ఆ ఆర్థిక మంత్రే కేసీ నియోగి. ఆర్థిక మంత్రిగా ఉంటూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయిన ఏకైక వ్యక్తి ఆయనే. నిజానికి 1948లో కేవలం 35 రోజులు మాత్రమే ఆర్థిక మంత్రిగా పని చేశారు. అతని తర్వాత జాన్ మథాయ్ భారత దేశానికి మూడో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అనంతరం ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రిగా మోరార్జీ దేశాయ్

స్వతంత్ర భారతదేశంలో అత్యధికసార్లు బడ్జెట్‌ను సమర్పించిన రికార్డును మొరార్జీ దేశాయ్ కలిగి ఉన్నారు. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా పదిసార్లు దేశ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో ఎనిమిది సాధారణ బడ్జెట్లు, రెండు మధ్యంతర బడ్జెట్లు ఉన్నాయి.