AAP rajya Sabha members join BJP :  ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద సంక్షోభం నెలకొంది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు శుక్రవారం  ప్రకటించారు. కేవలం ఆయనొక్కరే కాకుండా, రాజ్యసభలోని ఆప్ సభ్యులలో 2/3 వంతు మంది మొత్తం 10 మందిలో 7 గురు  తమను తాము బీజేపీలో విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సంజీవ్ పాఠక్, అశోక్ మిట్టల్ వంటి ఉద్ధండులు కూడా చద్ధా బాటలోనే పయనించారు. 

Continues below advertisement

 రాజ్యాంగ నిబంధనల రక్షణతో విలీనం 

ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకునేందుకు రాఘవ్ చద్దా బృందం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం, ఒక పార్టీకి చెందిన 2/3 వంతు సభ్యులు మరో పార్టీలో విలీనమైతే వారి సభ్యత్వాలకు ఎలాంటి ముప్పు ఉండదు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని, ఏడుగురు ఎంపీలు సంతకాలు చేసిన పత్రాలను రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించారు. ఈ జాబితాలో రాఘవ్ చద్దా, సంజీవ్ పాఠక్, అశోక్ మిట్టల్‌తో పాటు స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ ఉన్నట్లు సమాచారం.

Continues below advertisement

ఆప్ దారి తప్పిందన్న రాఘవ్ చద్దా

ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా భావోద్వేగంగా మాట్లాడారు. 15 ఏళ్ల నా  సమయాన్ని, రక్తాన్ని ధారపోసి ఈ పార్టీని నిర్మించాను. కానీ నేడు ఆప్ తన ప్రాథమిక సూత్రాలు, విలువలకు తిలోదకాలిచ్చింది. ఇది ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం వ్యక్తిగత లాభాల కోసం పనిచేస్తోంది. గత కొన్ని ఏళ్లుగా నేను ఒక  రాంగ్  పార్టీలో ఉన్న  రైట్ పర్సన్‌ని  అని నాకు అనిపించింది. అందుకే నేడు ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆయన స్పష్టం చేశారు.     

 పదవుల పంపకం.. అంతర్గత పోరు 

ఇటీవలి కాలంలో పార్టీ నాయకత్వానికి, రాఘవ్ చద్దాకు మధ్య పెరిగిన దూరం ఈ పరిణామానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి చద్దాను తొలగించి, ఆ స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించడం పెద్ద దుమారం రేపింది. అయితే, ఇప్పుడు చద్దా , మిట్టల్ ఇద్దరూ కలిసి బీజేపీలో చేరుతున్నారు.  ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధి పథంలో తాము భాగస్వాములు కావాలని భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

 ఆప్ మనుగడ  ప్రశ్నార్థకం 

ఒకేసారి ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడటం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ. ముఖ్యంగా పంజాబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుగురు ఎంపీలు ఈ బృందంలో ఉండటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆప్ పట్టు కోల్పోతోందన్న సంకేతాలను ఇస్తోంది.