2019 తరవాత మళ్లీ ఇప్పుడే..


యూకేలో వేడి గాలులు భయపెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అక్కడి వాతావరరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వం జాతీయ ఎమర్జెన్సీని విధించింది. ఇంగ్లాండ్‌లోని చాలా చోట్ల టెంపరేచర్లు పెరుగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అంతకు ముందే వాతావరణ మార్పులపై హెచ్చరికలు చేసిన అధికారులు...మంగళవారం తరవాత రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూకేలోని పట్టణ ప్రాంతాల్లో రాత్రుల్లో కూడా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా నమోదవుతున్నాయి. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని యూకే వాతావరణ విభాగం పేర్కొంది. ఇప్పటి వరకూ యూకేలో అత్యధిక ఉష్ణోగ్రతలు 2019లో రికార్డయ్యాయి. ఆ ఏడాది టెంపరేచర్లు ఏకంగా 38.7 డిగ్రీస్ సెల్సియస్ దాటింది. కేంబ్రిడ్డ్‌ బొటానిక్ గార్డెన్‌లో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే వేడి కొనసాగితే ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావటంతో పాటు ప్రాణానికే ప్రమాదమని అంటున్నారు అక్కడి నిపుణులు. పలు ప్రాంతాల్లో యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ,వాతావరణ విభాగం గత వారమే  లెవల్ -3 హీట్ హెల్త్ నోటీసులు జారీ చేశాయి. హెల్త్‌కేర్ ఏజెన్సీలు మునుపటి కన్నా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పుడా స్థాయి కూడా దాటిపోవటం వల్ల లెవల్-4 నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగితే హైరిస్క్‌లో ఉన్న వారితో పాటు ఆరోగ్యంగా ఉన్న ప్రజలపైనా ప్రభావం పడుతుందని అధికారులు వివరిస్తున్నారు.