అప్పుడే మాట వినుంటే బాగుండేది: ఠాక్రే 


మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,శివసేన ప్రెసిడెంట్ ఉద్దవ్ ఠాక్రే భాజపాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కూలిపోవటానికి కారణం భాజపానే అని ఇప్పటికే చాలా సార్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కేంద్రమంత్రి అమిత్‌షాను టార్గెట్ చేశారు ఠాక్రే. అమిత్‌షా అన్న మాట మీద నిలబడి ఉంటే మహా వికాస్ అఘాడీ అనే కూటమి ఏర్పడి ఉండేదే కాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. " శివసేన-భాజపా మిత్రపక్షాలుగా ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో అమిత్ షా నాకో హామీ ఇచ్చారు. వచ్చే 
రెండున్నరేళ్ల పాటు శివసేన అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరిస్తామని చెప్పారు. ఇప్పుడెలాగో అదే జరిగింది (ఏక్‌నాథ్‌ షిండేని ఉద్దేశిస్తూ). ఇదేదో అప్పుడే చేసుంటే భాజపాతో విడిపోయే వాళ్లం కాదు. కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు చేసే వాళ్లమే కాదు" అని వ్యాఖ్యానించారు ఉద్దవ్ ఠాక్రే. 


కోపం ఉంటే నా మీద తీర్చుకోండి, ప్రజలపైన కాదు..


"శివసేన కార్యకర్తను సీఎంగా చేశారని చెప్పుకుంటున్నారు. కానీ..ఈ ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్‌ షిండే) శివసేన సీఎం కాదు" అని అన్నారు ఠాక్రే. భాజపా తన మాటను గౌరవించి ఉంటే, రాష్ట్రంలో ఇన్ని రోజుల పాటు రాజకీయ సంక్షోభం ఉండేదే కాదని అభిప్రాయపడ్డారు. "శివసేన అభ్యర్థిని సీఎం చేశారు. ఇదేదో కాస్త మర్యాదపూర్వకంగా జరిగి ఉంటే బాగుండేది" అని అన్నారు. మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్ట్‌ని తిరిగి ప్రారంభించాలన్న ఏక్‌నాథ్ షిండే నిర్ణయంపైనా ఠాక్రే స్పందించారు. "నా మీద కోపాన్ని ముంబయి ప్రజల మీద చూపించొద్దు. మెట్రో కార్‌షెడ్‌ ప్రాజెక్ట్‌లో ఎలాంటి మార్పులు చేయవద్దు. ముంబయి వాతావరణంతో ఆటలు ఆడుకోవద్దు" అని అన్నారు ఠాక్రే. 


ఏంటీ మెట్రో కార్‌షెడ్ వివాదం..? 


2019లో ఫడణవీస్ ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే మెట్ర్ కార్‌షెడ్ ప్రాజెక్ట్‌ని ఆరే కాలనీలోనే నిర్మించేందుకు ఏక్‌నాథ్ షిండే పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణికి ఇందుకు సంబంధించిన సూచనలు చేశారు. కోర్ట్‌లో ఇదే విషయాన్ని వెల్లడించాలని చెప్పారు. 2019లో మొదలైంది ఈ వివాదమంతా. ఆరే కాలనీలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మించాలని ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ భావించింది. ఈ ప్రాంతంలోని చెట్లు తొలగించేందుకు అనుమతినివ్వాలని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ను అడిగింది. అయితే పర్యావరణ వేత్తల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తటం వల్ల అప్పటికి ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టింది ప్రభుత్వం. వేరే ప్రాంతానికి తరలించాలని భావించింది. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఆరే కాలనీలోనే ప్రాజెక్ట్ నిర్మించేందుకు కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటం వల్ల మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.