Karnataka Boy Felldown in Borewell: కర్ణాటకలోని లచయన్ గ్రామంలో రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోర్‌వెల్‌లో పడిపోయాడు. ఇంటి వద్దే ఆడుకుంటూ హఠాత్తుగా అందులో పడిపోయినట్టు గుర్తించారు. దాదాపు 20 గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్‌ మొత్తానికి ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. NDRFతో పాటు SDRF బృందాలు ఆ బాలుడిని ప్రాణాలతో బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. బాలుడు బయటకు రాగానే అప్పటి వరకూ ఉత్కంఠతో ఎదురు చూసిన వాళ్లంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. చప్పట్లు కొడుతూ సందడి చేశారు. అన్ని గంటల పాటు లోపలే ఉండిపోవడం వల్ల బాలుడి ఒళ్లంతా మట్టితో నిండిపోయింది. స్ట్రెచర్‌పై పడుకోబెట్టి మెడికల్ టీమ్‌ ఆంబులెన్స్‌లోకి పంపింది. అంతకు ముందు రోజు బోర్‌వెల్‌లోకి కెమెరా పంపిన అధికారులు బాలుడు బతికే ఉన్నాడని చెప్పడం వల్ల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే బయటకు తీసుకొచ్చేందుకే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 15-20 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్విరామంగా కొనసాగింది. ఆ సమయంలో బాలుడు గుక్కపట్టి ఏడ్చినట్టు అధికారులు తెలిపారు. 







బాలుడి తండ్రికి చెందిన నాలుగెకరాల స్థలంలో బోర్‌ బావి తవ్వుతున్నారు. అయితే దానిని మూసేయడం మర్చిపోయారు. అక్కడే ఆడుకుంటున్న బాలుడు ఆ గుంతలో పడిపోయాడు. మార్చి 3న సాయంత్రం 6.30 గంటల నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అంతకు ముందు రోజు పోలీసులు ఈ బోర్‌వెల్‌లోకి పైప్‌లు పంపారు. ఈ పైప్‌ల ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందించారు. ట్యూబ్‌వెల్ డ్రిల్లింగ్ వర్కర్స్‌ కూడా ఆపరేషన్‌కి సాయం చేయడం వల్ల సురక్షితంగా బాలుడిని బయటకు తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ ఎలా చేపట్టారో SDRF ఓ వీడియో విడుదల చేసింది. ఎంత శ్రమిస్తే ఇది సాధ్యమైందో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.