KTR, Siddaramaiah Tweet war: కాంగ్రెస్ ఇచ్చిన అన్నీ గ్యారెంటీలు అమలు సాధ్యం కాదని కర్నాటక అసెంబ్లీ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అన్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సిద్ధరామయ్య మాట్లాడిన ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి... తెలంగాణ భవిష్యత్ కూడా ఇంతేనా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. హామీలు ఇచ్చే ముందు ఆలోచించరా అంటూ నిలదీశారు. ఇంతకీ సిద్ధరామయ్య ఏమన్నారంటే... ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం... అన్నీ అమలు చేయాలంటే డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. ఎన్నికల ప్రచారంలో వాగ్ధానం చేసింది నిజమే.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా...? అన్ని వాగ్దానాలు అమలు చేయలేమని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఉత్తరాంధ్ర నౌ అనే సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన ఆ వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్రశలు సంధించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారని... హామీలు ఇచ్చే ముందు ఫైనాన్షియల్ కండిషన్ గురించి ఆలోచన చేయరా అని నిలదీశారు. కర్నాటకలో మాదిరిగానే తెలంగాణ భవిష్యత్ కూడా ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు.
అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్యే కేటీఆర్. ఏమాత్రం ఆలోచించకుండా మోసపూరిత వాగ్దానాలను ఎలా ఇస్తారని ఆయన క్వశ్చన్ చేశారు. హామీలు ఇచ్చే ముందు ఒక ప్లానింగ్ అంటూ వేసుకోరా అని కూడా నిలదీశారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా.. ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చి... గెలిచిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ కాంగ్రెస్ పార్టీపై ఫైరయ్యారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ అమలు చేయాలంటే... డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని కర్నాటక సీఎం సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు కేటీఆర్.
కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్‌గా మరో ట్వీట్ చేశారు కర్నాటక సీఎం సిద్ధరామయ్య. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఎందుకంటే... ఏది ఫేక్ వీడియో.. ఏది ఎడిట్ చేసిన వీడియో అన్నది నిర్ధారించడం కూడా బీఆర్‌ఎస్ పార్టీ తెలియదని అన్నారు. వీడియోను ఎడిట్ చేసి ఎవరో పోస్ట్ చేస్తే... ఆ వీడియోలు నిజమని నమ్మి... మీరు వాటిని ప్రచారం చేస్తారని దుయ్యబట్టారు. అందుకే బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి పర్‌ఫెక్ట్ బీటీమ్ అని అన్నారు సిద్ధరామయ్య. ఆ వీడియో నిజమైనదా... నకిలీదా అని తెలుసుకోవాలంటే... నిజమైన లింక్ ఓపెన్ చేసి చూడండి అంటూ... తాను మాట్లాడిన వీడియో లింక్‌ను పోస్టు చేశారు కర్నాటక సీఎం సిద్ధరామయ్య.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చింది. వాటిని పక్కాగా అమలు చేస్తామని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్నీ హామీలు అమలు చేస్తామని తెలిపింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే... ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను అమలు చేసింది. తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అందుకోసం జీరో టికెట్ విధానాన్ని తీసుకొచ్చింది. గుర్తింపు కార్డు చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు తెలంగాణ మహిళలు. ఇక.. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5లక్షల నుంచి 10లక్షలకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం.
రెండు హామీలు అమలు చేస్తున్నా... మిగిలిన వాగ్దానాల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, వరికి 500 రూపాయల బోనస్ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సకాలంలో హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని.. అయినా తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేస్తోంది.