Ukraine MP Attacks Russian:


అంతర్జాతీయ సదస్సులో కొట్లాట 


రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా వైరం చల్లారలేదని మరోసారి రుజువైంది. ఇటీవలే పుతిన్ బిల్డింగ్‌ డ్రోన్‌లు తిరగడం రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఓ రష్యన్ ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ చేయి చేసుకోవడం సంచలనమవుతోంది. ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఈ ఇద్దరు నేతలు గల్లా పట్టుకుని కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
టర్కీ రాజధాని అంకారాలోని ఓ సదస్సుకి ఈ ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 14 నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో వీళ్లు ఒకే వేదికపైకి రావడం ఆసక్తిని పెంచింది. అయితే...ఉక్రెయిన్ ఎంపీ ఒకరు నేషనల్ ఫ్లాగ్‌ని పట్టుకుని నిలబడి ఉన్న సమయంలో రష్యన్ ప్రతినిధి వచ్చి ఆ జెండాను లాగేసుకున్నారు. అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఇది చూసిన ఉక్రెయిన్ ఎంపీ కోపంతో ఊగిపోయాడు. ఆ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లాడు. జెండా మళ్లీ తిరిగి లాక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ రష్యన్ ప్రతినిధి ఆ జెండాను గట్టిగా పట్టుకున్నాడు. సహనం నశించిన ఉక్రెయిన్ ఎంపీ పిడి గుద్దులతో విరుచుకు పడ్డాడు. జెండా తిరిగి తన చేతుల్లోకి లాక్కున్నాడు. ఈ గొడవతో ఒక్కసారిగా అక్కడి వాళ్లంతా ఉలిక్కి పడ్డారు. ఘర్షణ పెరిగే ప్రమాదముందని గుర్తించి ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటికి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఇంటర్నేషనల్ మీటింగ్‌లో ఇలా కొట్టుకోవడం ఏంటని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.