బిలియనీర్‌, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ అమెరికా పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మస్క్‌తో సమావేశమయ్యారు. న్యూయార్క్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ భవనం సమీపంలో ఉన్న టర్కిష్‌ హౌస్‌లో వీరి సమావేశం జరిగింది. అయితే ఈ మీటింగ్‌కు మస్క్‌ తన కుమారుడు ఎక్స్‌ను తీసుకుని వచ్చారు. సమావేశం జరిగిన సమయంలో మస్క్‌ తన కొడుకును ఒడిలోనే కూర్చోబెట్టుకున్నారు. దీంతో ఎర్డోగాన్‌ బాబుతో ఆడుకునే ప్రయత్నం చేశారు. పలు మార్లు ఫుట్‌బాల్‌ బౌన్స్‌ చేసి పట్టుకొమ్మని అడిగారు. కానీ బాబు పట్టుకోలేదు. 


కొంచెం సేపటి తర్వాత టర్కీ అధ్యక్షుడి నుంచి మస్క్‌కు అనుకోని ప్రశ్న ఎదురైంది. మస్క్‌ను మీ భార్య ఎక్కడ అని ఎర్డోగాన్‌ అడిగారు. దీంతో మస్క్‌.. 'ఆమె శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఉంది. ఇప్పుడు మీము విడిపోయాం. అందుకే బాబును ఎక్కువగా నేనే చూసుకుంటున్నాను' అని సమాధానమిచ్చారు. 


మస్క్‌తో జరిగిన సమావేశంలో టర్కీలో టెస్లా కంపెనీ ఏడో కర్మాగారాన్ని స్థాపించాలని టర్కీ అధ్యక్షుడు కోరారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, స్టార్‌లింక్‌పై సహకారానికి టర్కీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. కొత్త కర్మాగారం స్థాపించడానికి అత్యంత ముఖ్యమైన అభ్యర్థనల్లో మీది ఉందని మస్క్‌ ఎర్డోగాన్‌తో తెలిపారు. టర్కీలో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ సేవలను అందించడానికి అవసరమైన లైసెన్స్‌లను పొందేందుకు టర్కీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు స్పేస్ ఎక్స్‌ భావిస్తున్నట్లు మస్క్‌ వెల్లడించారు.


మస్క్‌కు, కెనడియన్‌ సింగర్‌ గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వారు ఇప్పుడు విడిపోయారు. వీరి మొదటి సంతానం X AE A12 మే 2020లో జన్మించారు. మరో ఇద్దరు పిల్లలు ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. పాప పేరు ఎక్సా డార్క్‌ సైడెరాల్ మస్క్‌, బాబు పేరు టెక్నో మెకానికస్‌. మూడో సంతానం గురించి కేవలం ఒక నెల ముందే బయటకు వచ్చింది. ఎలాన్‌ మస్క్‌, గ్రిమ్స్‌ వివాహం చేసుకోలేదు. కానీ గత సెప్టెంబరులోనే వీరు విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఎలాన్‌ మస్క్‌కు ఇంతకంటే ముందు కెనడియన్‌ రచయిత జస్టిన్‌ విల్సన్‌తో వివాహం జరిగింది. ఇంకా ఇంగ్లిష్‌ యాక్టర్‌ తాలులా రిలేను కూడా పెళ్లి చేసుకున్నారు.