Turkey Blast:
అండర్‌గ్రౌండ్‌లో చిక్కుకున్న సిబ్బంది..
టర్కీలో భారీ పేలుడు సంభవించింది. నల్లసముద్రం తీరంలోని ఓ కోల్‌మైన్‌లో పేలుడు ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా కొంత మంది శిథిలాల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఓ ఇండస్ట్రీలో ఈ పేలుడు సంభవించింది. ఆ సమయంలో 28 మంది వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చారు. అలా ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా వాళ్లు లోపలే చిక్కుకున్నారు. వాళ్లలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తేలలేదు. ఇప్పటి వరకూ 22 మంది శవాలను గుర్తించారు. టర్కీలో ఈ మధ్య కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదమని స్థానికులు చెబుతున్నారు. "మేం చాలా దారుణమైన స్థితిలో ఉండిపోయాం. ఇండస్ట్రీలో దాదాపు 110 మంది అండర్‌గ్రౌండ్‌లో పని చేస్తున్నారు. కొంత మంది వెంటనే బయటకు వచ్చారు. కొంత మంది లోపల ఉన్నా ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు" అని ఓ బాధితుడు చెప్పాడు. 300-350 మీటర్ల లోతైన అండర్‌గ్రౌండ్‌లో దాదాపు 50 మంది సిబ్బంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. మొత్తం రెండు చోట్ల వీళ్లు ఇరుక్కుపోయినట్టు సమాచారం.
ముమ్మరంగా సహాయక చర్యలు..
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు స్థానికంగా అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇండస్ట్రీ ఎంట్రెన్స్ వద్ద నిలుచుని తమ వాళ్ల కోసం అందరూ ఎదురు చూస్తుండటం కంట తడి పెట్టిస్తోంది. కొందరు బతికి బయటపడినా..తీవ్ర గాయాలపాలయ్యారు. సాయంత్రం ఈ పేలుడు సంభవించింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. లోపలున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. మీథేన గ్యాస్ పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది వివరిస్తోంది. కానీ...దీనికి కారణమేంటని అప్పుడే నిర్ధరించటం లేదు పోలీసులు. విచారణ చేపట్టిన తరవాతే అసలు కారణమేంటో తేల్చుతామని వెల్లడించారు. సురక్షితంగా బయట మైనింగ్ సిబ్బందికి వెంటనే ఆక్సిజన్ అందించి హాస్పిటల్‌కు తరలించారు. కొంత మందిని స్థానికులే రక్షించి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇప్పటికే 70 మంది సిబ్బంది రంగంలోకి దిగి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. 250 మీటర్ల లోతు వరకూ వెళ్లినట్టు సమాచారం. అయితే...బాధితులు ఇంకా ఎంత లోతులో ఉన్నారో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఫలితంగా...సహాయక చర్యలు వేగంగా సాగించలేకపోతున్నారు.