Trump reposts racist rant against India and China : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. అందు కోసం భారత్ , చైనాల నుంచి వస్తున్న వలసలను కారణంగా చూపిస్తున్నారు. వలసదారులపై, ముఖ్యంగా భారత్ , చైనాల నుండి వచ్చే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు లభించే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ విధానాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అంశాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పొడవైన లేఖను రీ-షేర్ చేస్తూ, భారత్‌ను పరోక్షంగా నరకం తో పోల్చినట్లుగా ఉన్న వ్యాఖ్యలను ఆయన సమర్థించారు.
ట్రంప్ పంచుకున్న ఆ లేఖలో, భారత్, చైనా లేదా ఇతర నరకం లాంటి ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి బిడ్డకు జన్మనివ్వగానే ఆ పసికందుకి వెంటనే పౌరసత్వం లభిస్తోంది. ఆ తర్వాత వారు తమ మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకువస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల అమెరికా తన జాతీయ గుర్తింపును కోల్పోతోందని, ఇప్పుడు అమెరికా వీధుల్లో ఇంగ్లీష్ మాట్లాడే వారు కరువయ్యారని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఐరిష్, ఇటాలియన్ ప్రజలు అమెరికాలో కలిసిపోయేవారని, కానీ ప్రస్తుత వలసదారులకు దేశం పట్ల విధేయత లేదని విమర్శించారు.
కేవలం పౌరసత్వంపైనే కాకుండా, అమెరికాలోని టెక్ రంగంలో భారతీయుల ఆధిపత్యంపై కూడా ట్రంప్ వివాదాస్పద పోస్ట్‌లు చేశారు. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని టెక్ కంపెనీల్లో నియామక ప్రక్రియ మొత్తం భారతీయులు, చైనీయుల చేతుల్లోనే ఉందని, అక్కడ శ్వేతజాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని ఆరోపించారు. నేను గతంలో భారతీయులకు పెద్ద మద్దతుదారుడిని, కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో కళ్లు తెరిచి చూస్తున్నాను అని వ్యాఖ్యానించejg.
ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం, 2025 జనవరిలో ట్రంప్ జారీ చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును సమర్థించుకోవడమే. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు , తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇవ్వకూడదనేది ట్రంప్ లక్ష్యం. ప్రస్తుతం ఈ అంశం అమెరికా సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని చట్టం చెబుతుండగా, ట్రంప్ మాత్రం దానిని మార్చాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిణామాలు అమెరికాలోని భారతీయ సంతతి వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్-1బీ (H-1B) వీసాలపై ఉండి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది భారతీయులకు, వారి పిల్లల భవిష్యత్తుపై ఈ వ్యాఖ్యలు కొత్త భయాలను పుట్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ నిపుణులను కూడా ఈ విధంగా లక్ష్యంగా చేసుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.
