Near Death Experience: ఎవరైనా వెంట్రుక వాసిలో ప్రాణాలు కోల్పోతే యమధర్మరాజు లీవులో ఉండటమో.. ఏమరుపాటుగా ఉండటమో కారణం అని సెటైర్లు వేసుకుంటాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి బీహార్ లోని ముగ్గురు యువకులకు వచ్చింది. అసలే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. అందులోనూ మళ్లీ ఓవర్ స్పీడింగ్. పట్నా హైవేపై బండి తీసుకుని వారు చేసిన విన్యాసాలను చూసి వీరు ఎక్కడో ఓ చోట ఖచ్చితంగా పడిపోతారని అనుకున్నాడో వ్యక్తి. అందుకే వీడియో తీయడం ప్రారంభించాడు. నిజంగానే వారు ఓ కారు, లారీ నుధ్య నుంచి ఓవర్ టేక్ చేయాలనుకున్నారు. అక్కడే వారికి చావు ఎదురొచ్చింది.
ఉడుకు రక్తంతో చేసే పనుల వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయని..కన్న వారికి కడుపుకోతకు గురి చేస్తూంటారని నెటిజన్లు మండి పడుతున్నారు. కనీసం కాస్త అయినా ట్రాఫిక్ సెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సలహాలిస్తున్నారు.
.. ప్రతీ ఒక్కరికి.. ప్రతి రోజూ సెకండ్ చాన్స్ రాదని గుర్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలు ఏటా అనేక మందిని కబళిస్తున్నాయి. ప్రతి 3 నిమిషాలకొకరు మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రహదారి మరణాల్లో భారత వాటా 11% గా ఉంది. జీడీపీలో 3.14% నష్టానికి రోడ్డు ప్రమాదాలు కారణమవుతున్నాయి. ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 19 మంది దాకా మరణిస్తున్నారు. నిత్యం సగటున 1264 చిన్న, పెద్ద రహదారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రహదారి మరణాల్లో భారత వాటా 11%గా ఉంది. ఏటా వేలాది కుటుంబాల్లో రోడ్డు టెర్రర్ విషాదం నింపుతోంది. దేశంలో రహదారి ప్రమాద మరణాల్ని 2030 నాటికి కనీసం సగానికి తగ్గించాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
అయితే ఏ మాత్రం ట్రాఫిక్ సెన్స్ లేని యువత వల్ల.. నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు చేసిన వారే కాకండా వారి వల్ల ఇతరులు కూడా నష్టపోతున్నారు.