Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Mamata Banerjee Rebellion West Bengal: బెంగాల్‌లో మమతా బెనర్జీ పరిస్థితి రాను రాను ఘోరంగా మారుతోంది. ఆమె ఏర్పాటు చేసిన సమావేశానికి ఆరుగురు అంటే ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు.

TMC National Working Committee Meeting: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన అంతర్గత తిరుగుబాటును , చారిత్రాత్మక చీలిక ముప్పును ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత కోట అయిన భవానీపూర్‌లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోవడంతో ఈ సంక్షోభం ఒక్కసారిగా బద్దలైంది. తీవ్ర సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న తృణమూల్‌లో మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల నాయకత్వ శైలిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా తిరుగుబావుటా ఎగురవేశారు.
ఈ తిరుగుబాటు తీవ్రతకు అద్దం పడుతూ, కోల్‌కతాలోని మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలో జరిగిన కీలక సమావేశానికి ఘోరమైన స్పందన లభించింది. పార్టీకున్న 80 మంది ఎమ్మెల్యేలలో గత సమావేశానికి 60 మంది గైర్హాజరు కాగా, తాజాగా నిర్వహించిన అత్యవసర భేటీకి కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అలాగే పార్టీకున్న 28 మంది లోక్‌సభ ఎంపీలలో నలుగురు, 13 మంది రాజ్యసభ సభ్యులలో కేవలం ఇద్దరు డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్ మాత్రమే నేరుగా వచ్చారు. అయితే, ఈ పరిస్థితిపై స్పందించిన టీఎంసీ యాజమాన్యం.. ఇది అందరి కోసం పెట్టిన సమావేశం కాదని, కేవలం నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశం మాత్రమేనని, కొందరు వర్చువల్‌గా హాజరయ్యారని సర్దుబాటు చెప్పుకునే ప్రయత్నం చేసింది.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఉలుబేరియా పూర్బా ఎమ్మెల్యే రీతాబ్రతా బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటుదారులు ఏకంగా మమతా బెనర్జీ శాసనసభాపక్షాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ 58 మందికి పైగా మద్దతును కూడగట్టిన రీతాబ్రతా.. అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ నుండి అధికారికంగా ప్రతిపక్ష నేత గుర్తింపును కూడా సాధించి మమతకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా కచ్చితమైన సంఖ్యాబలంతో తామే అసలైన తృణమూల్ అని ఆయన స్పీకర్ ముందు నిరూపించుకోగలిగారు.
అసెంబ్లీ వేదికగా మమతపై పైచేయి సాధించిన రీతాబ్రతా బెనర్జీ రాబోయే రోజుల్లో తమ వైపు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరుగుతుందని, అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ బలం స్పష్టంగా కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము ఎంపీలతో పెద్దగా సంప్రదింపులు జరపలేదని చెప్తున్నప్పటికీ, తెరవెనుక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు, తిరుగుబాటు తీవ్రతను తగ్గించేందుకు మమతా బెనర్జీ ఇప్పటికే ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు.
STORY | Documents from TMC MLA meetings at Mamata's house surface online; rebel Ritabrata questions authenticity
— Press Trust of India (@PTI_News) June 6, 2026
A fresh twist emerged in the battle for the leadership of the TMC legislature party on Saturday after documents purportedly relating to two meetings of party MLAs at… pic.twitter.com/hmzCZ4iQUq
ఈ రాజకీయ గందరగోళాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కనీసం 20 మంది ఎంపీలు ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ ఓటమి, నాయకత్వంపై అసంతృప్తి, , భవిష్యత్తుపై అభద్రతాభావం కారణంగా చాలా మంది ప్రజాప్రతినిధులు జంప్ జిలానీలుగా మారేందుకు సిద్ధమవుతున్నారు. బెంగాల్ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలిగిన మమతా బెనర్జీ సామ్రాజ్యం, ఇప్పుడు సొంత నేతల తిరుగుబాటుతో కుప్పకూలే ప్రమాదంలో పడిందని బెంగాలీ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















