Breaking News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న తమిళనాడు సీఎం విజయ్ - ప్రధానమంత్రితో భేటీ!
ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాల లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం. అప్టేడ్స్ కోసం పేజీ రిఫ్రెస్ చేయండి.
LIVE

Background
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో సామాన్యుడిపై భారం మరింత ఎక్కువవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలకు.. వరుసగా పెరుగుతున్న సిఎన్‌జి (CNG) ధరలు జేబుకు చిల్లు పెడుతున్నాయి.
మే 26న దేశ రాజధాని ఢిల్లీలో సిఎన్‌జి ధర కిలోకు రూ.2 మేర పెరిగింది. ఈ తాజా పెంపుతో నిన్నటి వరకు రూ.81.09 గా ఉన్న ధర, నేడు రూ.83.09 కి చేరింది. కేవలం 11 రోజుల వ్యవధిలోనే సిఎన్‌జి ధరలు పెరగడం ఈ మే నెలలో ఇది నాలుగో సారి. దీనికి ముందు మే 23న కూడా కిలోకు రూపాయి పెరగడంతో ధర రూ.80.09 నుండి రూ.81.09 కి చేరిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ మరియు దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఈ విధంగా మండిపోతుంటే, ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత నెలలో ముంబైలో సిఎన్‌జి ధర కేవలం 50 పైసలు పెరిగింది. అప్పటి నుండి అక్కడ కిలో సిఎన్‌జి రేటు ఎటువంటి మార్పు లేకుండా రూ.81 వద్దే కొనసాగుతోంది.
ఎబోలా వైరస్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తతం..
ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయానశాఖ ఆదేశాల మేరకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఎబోలా స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుండి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది స్క్రీనింగ్ జరిపారు. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే క్వారంటైన్‌కు తరలిస్తామని వైద్యులు స్పష్టం చేశారు.
ఎబోలా మనుషులు, జంతువులకు సోకే అత్యంత ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. ఇది సోకిన వారి రక్తం, లాలాజలం, శరీర ద్రవాల ద్వారా లేదా అడవి జంతువులు, గబ్బిలాల మాంసం తినడం వల్ల వేగంగా వ్యాపిస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుండి 21 రోజులలోపు దీని లక్షణాలు బయటపడతాయి.
ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాలలో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతుండటంతో WHO తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని తీవ్రతను బట్టి WHO చీఫ్ టెడ్రోస్ గెబ్రియేసస్ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా 'బుండిబుగ్యో' రూపానికి నిర్దిష్ట వ్యాక్సిన్ లేదా చికిత్స లేకపోవడంతో ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ ఇతర దేశాలకు పాకే ముప్పు ఉన్నందున, అంతర్జాతీయ విమానాశ్రయాలు, సరిహద్దుల వద్ద నిఘా మరియు స్క్రీనింగ్ పరీక్షలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కాంగోలో దీని ముప్పు చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమై, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులకు ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించింది.
Tamil Nadu News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న తమిళనాడు సీఎం విజయ్ - ప్రధానమంత్రితో భేటీ!
Tamil Nadu News: తమిళనాడు సీఎం విజయ్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీని తొలిసారిగా కలవనున్నారు. కావేరి నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకధాతు డ్యాం వివాదంపై లేఖ అందించనున్నారు.
Telangana Crime News: మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పోలీస్‌స్టేషన్ ముందు పురుగుల మందు డబ్బాతో మహిళ ధర్నా
Telangana Crime News: మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని తాళ్లగురజాల పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ మందు డబ్బాతో బైఠాయించి నిరసన తెలిపారు. ట్రాక్టర్ దొంగతనం కేసులో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు… తమనే వేధిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఊరిలో ఒకరికి డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ సెటిల్మెంట్ చేసి పేపర్ రాసి ఇస్తేనే ట్రాక్టర్ అప్పగిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని వాపోయారు.
ట్రెండింగ్ వార్తలు






















