Breaking News:ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
Top Stories Today | జూన్ 11న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, సినీ, క్రీడా ఇతర రంగాల అప్‌డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం. అప్డేట్స్ పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories Today | టుడే న్యూస్ లేటెస్ట్ అప్‌డేట్స్
Vizag News: ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
Vizag News: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా చేసిన దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ సురేష్ పట్నాల (44) ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, దిల్లీలోని ఆంధ్రా భవన్ అధికారులు ధ్రువీకరించారు.
సురేష్‌కు భార్య భార్గవితోపాటు 13, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. త్వరలో (జూన్ 24న) 15వ తమ వివాహ వార్షికోత్సవం అని అంతలోనే తన భర్త శాశ్వతంగా దూరమయ్యారని భార్గవి విలపించారు. ఐదు నెలలపాటు విధుల్లో ఉన్న సురేష్.. త్వరలోనే ఇంటికి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనుమతి కూడా పొందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Revanth Reddy Met with PM Modi: ప్రధానమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
Revanth Reddy Met with PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణసీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు , కేంద్ర నిధుల విడుదలపై ప్రధానితో సీఎం చర్చించారు.
Nirmal District: నిర్మల్ జిల్లాలో రెండు లారీలు ఢీ! డ్రైవర్ సజీవ దహనం!
Nirmal District: నిర్మల్ జిల్లాలోని మేడిపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. వివరాల్లోకి వెళితే నిర్మల్ రూరల్ మండలంలోని మేడిపల్లి గ్రామ సమీపంలో గల 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన ఆలుగడ్డల లారీని వెనుక నుంచి జొన్నల లోడుతో వెళ్తున్న మరో లారీ వేగంగా ఢీకొట్టింది. లారీ ఢీకొన్న వెంటనే రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన లారీ డ్రైవర్ జవారి సింగ్ క్యాబిన్‌లో చిక్కుకుని సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘటనాస్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. పోస్టు మాత్రం నిమిత్తం డెడ్ బాడీని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రమాదాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
America Attack: ఒమన్‌లో నౌకలపై అమెరికా క్షిపణి దాడి- ముగ్గురు భారతీయ నావికులు మృతి
America Attack: ఒమన్ తీరంలోని నౌకలపై అమెరికా క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో భారతీయ నావికులు ముగ్గురు మృతి చెందారు. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారిలో 21 మందిని ఒమన్ సైన్యం సురక్షిత ప్రాంతానికి తరలించింది.
Telangana Inter Results | తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఆన్‌లైన్‌లో ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురువారం విడుదల చేసింది.
తెలంగాణ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఏపీ లిక్కర్ స్కామ్: కీలక సూత్రధారి రాజ్‌కెసిరెడ్డి అరెస్ట్
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. వేల కోట్ల ఏపీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు చేపట్టింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజ్‌కెసిరెడ్డిని హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు అధికారులు గుర్తించారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ, ఈ కేసులో మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో వైకాపా నేతలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, మాజీ సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
డీఎస్సీ ఎగ్జామ్ నిర్వహణలో ఉన్న వ్యక్తి టాపర్ కావడం స్కామ్ కాదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ జగన్
తాడేపల్లి: అబద్ధం, వెన్నుపోటు, స్కాములకు ప్యాంట్, చొక్కా తొడిగితే ఏపీ సీఎం చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణించాయని, విపక్ష నేతలపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని ప్రెస్ మీట్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. 16 వేల డీఎస్సీ పోస్టుల భర్తీలో స్కామ్ చేశారని, అవకతవకలు జరిగాయని ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ తయారీని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. నవీన్ అనే వ్యక్తి ఎగ్జామ్ నిర్వహణలో ఉన్నాడని, అతడికి టాప్ ర్యాంక్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టాప్ ర్యాంక్ వచ్చిన నవీన్ కు జాబ్ ఎందుకు ఇవ్వలేదని, అతడి డేటాను ఎందుకు మాయం ప్రశ్నించారని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని గుర్తు చేసిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పథకాలకు తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీల అమలు ఎటుపోయిందని ప్రశ్నించిన ఆయన, నిరుద్యోగ భృతి, ఇతర హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు! రాజ్‌కసిరెడ్డి సహా పలువురి నివాసాలపై రైడ్
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లపై ఈడీ మరోసారి దాడులు చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్‌కసిరెడ్డిసహా ఆరుగురి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తోంది. దాదాపు పది ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంటులో మరో ప్రమాదం.. కింద పడిన ఉక్కుద్రవం
విశాఖ స్టీల్ ప్లాంటులో మరో ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఎస్ఎంఎస్ 1 టీపీబీలో ల్యాడిల్‌కు రంద్రం పడి అందులో ఉన్న ఉక్కు ద్రవం కింద పోయినట్లు తెలుస్తోంది. ఉదయం 6.30 ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అయితే కార్మికులకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇథనాల్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రద్దు
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు అందించింది. దిగుమతి బిల్లును తగ్గించి, రూపాయి విలువను మెరుగుపరచడానికి 22% నుండి 30% (E22, E25, E27, E30) ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా రద్దు చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించింది.
BIS ప్రమాణాల ప్రకారం తయారయ్యే ఈ చౌక ఇంధనానికి డిమాండ్ పెరిగితే సామాన్యులకు భారీ ఊరట లభిస్తుంది. అలాగే చెరకు, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యాల నుండి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు కూడా ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది.
పూణేలో నేడు కాక్రోచ్ జనతా పార్టీ నిరసన.. సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వం వహిస్తారా ?
ఎగ్జామ్ పేపర్లు లీకవుతున్నాయని, పరీక్షలు నిర్వహించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ తో నేడు మహారాష్ట్రలోని పుణేలో జరిగే నిరసనలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొననున్నారు.
విద్యార్థులకు, వారి డిమాండ్లకు మద్దతుగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని అభిజీత్ దిప్కే పిలుపునిచ్చారు. “జూన్ 11న పుణేలో జరిగే మా నిరసనలో సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొంటున్నారు. విద్యార్థులకు అండగా నిలవడానికి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేయడానికి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని మేము కోరుతున్నాము” అని ఆ ప్రకటన పేర్కొంది. నిరుద్యోగ యువతపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఉద్భవించిన, విద్యార్థుల సారథ్యంలోని ఉద్యమమైన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)’ కి మద్దతు పెరుగుతున్న క్రమంలో ఈ నిరసన జరుగుతోంది.
హర్మూజ్ సీక్రెట్ మిషన్‌పై ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిపై ఒక సంచలన ప్రకటన చేశారు. అమెరికా సైన్యం అత్యంత రహస్యంగా నిర్వహించిన మిషన్ విజయవంతమైందని వెల్లడించారు. తన ఆదేశాల మేరకు గత నెలలో జరిగిన ఈ ఆపరేషన్ ద్వారా, వివాదాస్పద హర్మూజ్ జలసంధి గుండా 10 కోట్ల బ్యారెళ్లకు పైగా చమురును ప్రపంచ మార్కెట్‌కు చేర్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో 200కు పైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని తెలిపారు.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'తో పాటు వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ ఈ వివరాలను పంచుకున్నారు. అమెరికా చాలా కాలంగా హర్మూజ్ ద్వారా లక్షల బ్యారెళ్ల చమురును తరలిస్తోందని, ఈ విషయం ఇప్పటివరకు ఇరాన్‌కు అస్సలు తెలియదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సీక్రెట్ మిషన్ అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు భారీ ఊరటనిచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
అమరావతి: మధ్య బంగాళాఖాతం నుండి కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో గురువారం (జూన్ 11న) ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా మార్కాపురం, రాయలసీమ ప్రాంతాలతో పాటు అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు.
గడిచిన 24 గంటల్లో విజయవాడ, మచిలీపట్నం సహా పలుచోట్ల ఉరుముల వర్షం కురిసింది. బుధవారం సాయంత్రానికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మి.మీ., లావేరులో 64.5 మి.మీ. గరిష్ఠ వర్షపాతం నమోదైంది. మరోవైపు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
అమరావతి: భారత్‌లో నైరుతి రుతుపవనాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఇవి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. దీనికితోడు బంగాళాఖాతం నుండి తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ద్రోణి, ఉత్తరప్రదేశ్ నుండి విదర్భ వరకు మరో ద్రోణి ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో గురువారం నుండి 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాలు, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు























