Kerala Assembly elections Rajnath campaign: కేరళ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీలు లోపాయికారీగా కలిసిపోయాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. బుధవారం ఎర్నాకులం జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేరళలోని రెండు ప్రధాన కూటములు అవినీతి ఆరోపణలతో ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాయని, ముఖ్యమంత్రి తన కుటుంబంతో సహా సిబిఐ కేసులు ఎదుర్కోవడం ఆ రాష్ట్రానికి గర్వకారణం కాదని పేర్కొన్నారు.
ఈ సభలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ ఎన్నికల్లో ఎర్నాకులం ఇంచార్జ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్ గారితో వేదిక పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేరళ ప్రజలలో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు జాతీయవాదం వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని విస్మరించి కేవలం విమర్శలకే పరిమితమైందని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ-ఎన్డీయే కూటమి మాత్రమే కేరళకు సరైన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. అవినీతిరహిత పాలన, పారదర్శకత మరియు సుశాసనం కోసం కేరళ ప్రజలు ఇప్పుడు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేరళలో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో నెలకొన్న అవినీతి పీడను వదిలించుకోవాలంటే ప్రజలు మేల్కోవాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, అందుకే ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని సభలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం కేరళ రాజకీయాల్లో రాబోయే మార్పుకు సంకేతమని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
