Tinkesh Kaushik Reaches Everest Base Camp: గోవాకి చెందిన 30 ఏళ్ల టింకేశ్ కౌశిక్ (Tinkesh Kaushik) ప్రపంచంలోనే మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ని చేరుకున్న తొలి దివ్యాంగుడిగా రికార్డు సృష్టించాడు. సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న క్యాంప్‌కి (Mount Everest Base Camp) చేరుకున్నట్టు ఓ సంస్థ వెల్లడించింది. మే 11వ తేదీన తన ప్రయాణాన్ని ముగించాడు కౌశిక్. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ముందుకు సాగిపోయాడు. మానసిక బలంతో ఈ లక్ష్యాన్ని సాధించాడు.


ఆ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి..


హరియాణాకి చెందిన టింకేశ్ కౌశిక్‌ 9 ఏళ్ల వయసులో ఎలక్ట్రిక్ షాక్‌కి గురయ్యాడు. ఆ ప్రమాదంలో రెండు కాళ్లనూ పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి ప్రోస్థెటిక్ లింబ్స్‌ని వాడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం గోవాకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడే ఫిట్‌నెస్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. కౌశిక్ సాధించిన విజయంపై  Disability Rights Association of Goa (DRAG) ఆనందం వ్యక్తం చేసింది. గోవా ప్రజల్ని తలెత్తుకుని తిరిగేలా చేశాడంటూ ప్రశంసలు కురిపించింది. ఈ ఫీట్ సాధించడంపై కౌశిక్ స్పందించాడు. స్వతహాగా ఫిట్‌నెస్ కోచ్ కావడం వల్ల ట్రెకింగ్ చాలా సులభమే అనుకున్నానని, కానీ శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించాడు. 


"నేనో ఫిట్‌నెస్‌ కోచ్‌ని. ట్రెకింగ్ చాలా సింపుల్ అనుకున్నాను. కానీ ట్రైనింగ్ తీసుకున్నాక కానీ తెలియలేదు అది ఎంత కష్టమో. మౌంటనీరింగ్‌లో అంతకు ముందు నాకు ఎలాంటి అనుభవం లేదు. బేస్‌ క్యాంప్‌కి వెళ్లాలనుకునే ముందే ట్రైనింగ్ తీసుకున్నాను. ప్రోస్థెటిక్ లింబ్స్‌తో శిక్షణ తీసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. అదే సమయంలో ఛాలెంజింగ్‌గానూ అనిపించింది. కచ్చితంగా చేయాలని నిశ్చయించుకున్నాను. మధ్యలో కాస్త సిక్ అయ్యాను. నా మానసిక బలంతోనే సవాలుని అధిగమించాలని అనుకున్నాను"


- టింకేశ్ కౌశిక్ 






ఈ ఫీట్ సాధించిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు అన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ పెట్టాడు కౌశిక్. మే 11వ తేదీన ఎంతో సాహసాలతో కూడుకున్న ట్రెకింగ్ చేసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి చేరుకున్నట్టు వెల్లడించాడు. 90% వైకల్యంతో ఉన్న తాను ఈ లక్ష్యం సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. భావోద్వేగానికి లోనైనట్టు వివరించాడు. ఇది తన కోసం తాను సాధించిన విజయమని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అంగవైకల్యం ఉందని ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్లానని వెల్లడించాడు. 


 






Also Read: Uttar Pradesh: వధువుకి బలవంతంగా ముద్దు పెట్టిన వరుడు, తండ్రి అభ్యంతరం - వేదికపై కర్రలతో కొట్టుకున్న కుటుంబాలు