Ladakh Statehood Demand: లద్దాఖ్‌లోని లేహ్‌ జిల్లాలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో బంద్ పాటించారు. లద్దాఖ్‌కి రాష్ట్రహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో తమ ప్రాంతాన్ని కలపాలని, తమను షెడ్యూల్‌ తెగలకు గుర్తించాలని డిమాండ్ చేశారు. లేహ్‌, కార్గిల్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల ఏర్పాటు చేయడంతో పాటు స్థానికులకు జాబ్ రిజర్వేషన్‌లు కల్పించాలన్న డిమాండ్‌లనూ వినిపించారు. రోడ్లపైకి వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బ్యానర్‌లు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. 






2019లో ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అప్పటి వరకూ జమ్ముకశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తరవాత లద్దాఖ్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. అప్పటి నుంచి లద్దాఖ్‌కి రాష్ట్రహోదా కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఇప్పుడు  Leh Apex Body తో పాటు Kargil Democratic Alliance (KDA) ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తోంది. ఇప్పటికే కేంద్రహోం మంత్రిత్వ శాఖకి మెమొరాండం పంపాయి. లద్దాఖ్‌కి రాష్ట్రహోదా కల్పించాలని జనవరి 23వ తేదీన విజ్ఞప్తి చేశాయి. 


"లద్దాఖ్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినప్పటి నుంచి మేం నాలుగు డిమాండ్‌లు వినిపిస్తున్నాం. ప్రజల కేంద్రంగా ఉండే పరిపాలన అంతా ఒక్కసారిగా మారిపోయింది. మేం జమ్ముకశ్మీర్‌లో కలిసి ఉన్నప్పుడు మా ప్రాంతం తరపున అసెంబ్లీలో నలుగురు సభ్యులుండే వాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. లద్దాఖ్ ప్రజల తరపున మాట్లాడే ప్రతినిధి కచ్చితంగా అవసరం. అందుకే మాకు రాష్ట్రహోదా కావాలని డిమాండ్ చేస్తున్నాం"


- హాజీ గులామ్ ముస్తఫా, లేహ్ అపెక్స్ బాడీ 


లద్దాఖ్‌కి రాష్ట్రహోదా కల్పించాలని డ్రాఫ్ట్‌బిల్‌నీ తయారు చేసి కేంద్రహోం శాఖకు పంపినట్టు లేహ్‌ అపెక్స్ బాడీ ప్రతినిధులు వెల్లడించారు. మంత్రి నిత్యానంద్ రాయ్‌ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటైంది. లేహ్‌, లద్దాఖ్‌కి చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయి.