Thirupparakundram fire in Tamil Nadu politics: తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పర కుండ్రం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. శతాబ్దాలుగా హిందూ-ముస్లిం సామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ కొండ, ప్రస్తుతం మతపరమైన రాజకీయాలకు వేదికగా మారింది.
దక్షిణ భారత్ 'అయోధ్య'గా మారుతోందా? తిరుప్పర కుండ్రం చుట్టూ ముదురుతున్న రాజకీయం!
తమిళనాడులో మురుగన్ ఆరు క్షేత్రాల్లో మొదటిదైన తిరుప్పర కుండ్రం ఇప్పుడు రాజకీయ సెగలతో రగులుతోంది. ఈ కొండపై మురుగన్ ఆలయంతో పాటు శతాబ్దాల నాటి సికందర్ బాదుషా దర్గా కూడా ఉంది. ఇన్నాళ్లూ కలిసిమెలిసి ఉన్న ఈ రెండు మతాల మధ్య, ఇటీవలి కాలంలో కార్తీక దీపం వెలిగించడం , జంతు బలుల విషయంలో తలెత్తిన వివాదాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈ ప్రాంతాన్ని దక్షిణ భారత్ అయోధ్య గా అభివర్ణించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయికి చేరింది.
వివాదానికి మూలం ఏమిటి?
ఇటీవలి కాలంలో కొండపై ఉన్న దీప స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే, దర్గాకు సమీపంలో దీపం వెలిగిస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని డీఎంకే ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు, దర్గాలో జంతు బలులు ఇవ్వడంపై కూడా హైకోర్టు ఆంక్షలు విధించడం ఉద్రిక్తతలకు దారితీసింది. కొండ పేరును సికందర్ మలై ' అని పిలవాలా లేక తిరుప్పర కుండ్రం మలై అని పిలవాలా అనే అంశంపై కూడా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఏ పార్టీ వైఖరి ఏమిటి?
బీజేపీ ఈ అంశాన్ని తన హిందుత్వ అజెండాకు ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. దశాబ్దాలుగా హిందువుల హక్కులను డీఎంకే కాలరాస్తోందని, దర్గా ప్రాంగణంలో దీపం వెలిగించే హక్కు హిందువులకు ఉందని వాదిస్తోంది. ఈ సమస్య ద్వారా తమిళనాడులో హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. అధికార డీఎంకే ప్రభుత్వం దీనిని సామరస్య సమస్య గా చూస్తోంది. కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామని చెబుతూనే, మత విద్వేషాలను రగిలించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. మైనారిటీల హక్కులను కాపాడటమే తమ ప్రాధాన్యత అని డీఎంకే సంకేతాలు ఇస్తోంది. ఈ విషయంలో అన్నాడీఎంకే ఆచితూచి స్పందిస్తోంది. ప్రభుత్వం కోర్టు తీర్పులను గౌరవించాలని చెబుతూనే, అటు హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇటు ముస్లింల మద్దతు కోల్పోకుండా జాగ్రత్త పడుతోంది.
ఎన్నికలపై ప్రభావం వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వివాదం పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. తమిళనాడులో ఇప్పటివరకు ద్రవిడ రాజకీయాలు కుల వివక్ష, సామాజిక న్యాయం ప్రధానంగా ఉండగా, ఇప్పుడు బీజేపీ దానిని మతపరమైన రాజకీయాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. మురుగన్ అంటే తమిళులకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని ఆసరాగా చేసుకుని, డీఎంకేను హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం వర్సెస్ హిందుత్వ సిద్ధాంతం మధ్య జరిగే ఈ పోరులో తిరుప్పర కుండ్రం ఇప్పుడు ఒక కీలక అంశంగా మారింది.