Coldwar between DMK MP and MLA in Tamil Nadu: అధికారిక కార్యక్రమంలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులు స్టేజ్ మీద ఉంటే రచ్చ జరుగుతుంది. తెలంగాణలో శుక్రవారం పలు చోట్ల రేషన్ కార్డుల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య అధికారిక కార్యక్రమ వేదికపైనే వాదులాడుకున్నారు. అయితే ఈ రాజకీయం తమిళనాడులో కాస్త అతిగానే ఉంటుంది. అధికార పార్టీకి చెందిన వారే గొడవపడ్డారు.
2025 ఆగస్టు 2న, తమిళనాడులోని తేని జిల్లాలోని అండిపట్టిలో "నలం కాక్కుం స్టాలిన్" (ఆరోగ్య స్టాలిన్) సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. తేని డిఎంకె ఎంపీ తంగ తమిళ్‌సెల్వన్ , అండిపట్టి డిఎంకె ఎమ్మెల్యే మహారాజన్ ఈ పథకం సర్టిఫికెట్లు లబ్దిదారులకు పంపిణీ చేశారు. అయితే సర్టిఫికెట్లు ఎవరు పంపిణీ చేయాలన్నది వివాదాస్పదమయింది. ఇద్దరూ ఆ సర్టిపికెట్లను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య వేదికపై జరిగిన తీవ్రమైన మాటల ఘర్షణ కారణంగా హఠాత్తుగా వివాదాస్పదంగా మారింది.
ఈ ఘర్షణకు ఖచ్చితమైన కారణాలు బహిర్గతం కాలేదు, కానీ స్థానిక రాజకీయ ఆధిపత్యం లేదా వ్యక్తిగత ఈగోలు ఈ విభేదాలకు దోహదపడి ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. కొందరు ఈ ఘటనను అండిపట్టి నియోజకవర్గంలో నాయకత్వ పోటీగా చూస్తున్నారు. ఈ ఘటన డిఎంకె పార్టీలో ఐక్యత లేకపోవడాన్ని సూచిస్తుందని, ఇది స్థానిక స్థాయిలో పార్టీ కార్యకర్తల మనోభావాలపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. పార్టీ హైకమాండ్ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని డీఎంకే కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.
తమిళనాడు రాజకీయాలు జోరు మీద ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేసింది. మరో వైపు పార్టీ నేతలు మాత్రం ఆధిపత్య పోరాటానికి దిగుతున్నారు. వీరి గొడవలను ఇతర పార్టీల నేతలు.. సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా వైరల్ చేస్తున్నారు.