Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలకు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎప్పుడో వేసవి కాలంలో రావాల్సిన వర్షాలు వేసవి మొదట్లోనే పడుతున్నాయని అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు అధికారులు.
తెలంగాణలో మూడు రోజుల నుంచి వాతావరణం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వాతావరణ పరిస్థితిని ముందే గ్రహించిన అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వివరించారు. శుక్రవారం నుంచి వాతావరణం నార్మల్‌గా ఉంటుందని ఉక్కపోత మొదలవుతుందని వెల్లడించారు.
నాలుగు జిల్లాలకు వర్షాల హెచ్చరిక ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత మాత్రం తగ్గదని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదు అవుతున్నాయని తెలిపారు. బుధవారం కూడా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడ్డాయి.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉదయం లేదా రాత్రివేళల్లో పొగమంచు పరిస్థితులు ఏర్పడతాయి. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు ఉంటే, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు ఉంటుంది. ఉపరితల గాలులు దక్షిణ ఆగ్నేయ దిశలో గంటలు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలుగా నమోదు అయితే కనిష్ట ఉష్ణోగ్రత 20.9గా రికార్డు అయ్యింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నప్పటికీ మరో రెండు మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. దాదాపుగా మార్చి 1 నుంచి ఎండలు మండిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీహైడ్రేట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
