Speaker decision on disqualification petitions:  తెలంగాణలో  కొంతకాలంగా సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టు గురువారం  కీలక ముగింపునిచ్చింది. స్పీకర్ నిర్ణయం ప్రకటించినందుకు పిటిషన్లపై విచారణ ముగించింది.  తక్షణమే ఎవరిపై అనర్హతా వేటు పడకపోయినప్పటికీ, భవిష్యత్తు రాజకీయాల కోసం ఒక బలమైన  న్యాయపరమైన బెంచ్ మార్క్ ని ఈ పిటిషన్లు సృష్టించాయి.  

Continues below advertisement

కాలయాపనకు అడ్డుకట్ట                                

సాధారణంగా పార్టీ ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్లు తమకు ఉన్న  విచక్షణాధికారం పేరుతో అనర్హతా పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతుంటారు. అసెంబ్లీ పదవీకాలం ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా నాన్చడం ద్వారా ఫిరాయింపుదారులకు మేలు జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ వేసిన పిటిషన్ల కారణంగా సుప్రీంకోర్టు ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేసింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద స్పీకర్ ఒక ట్రిబ్యునల్  లాగా వ్యవహరించాలని, నిర్ణయాలను సకాలంలో వెల్లడించాలని స్పష్టం చేసింది.

Continues below advertisement

నిర్దిష్ట గడువు - తప్పనిసరి బాధ్యత                                 

ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు స్పీకర్‌కు స్పష్టమైన గడువులను విధించడం ఒక మైలురాయిగా నిలిచింది. స్పీకర్ పదవికి రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ, అనర్హతా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని ఈ పరిణామం నిరూపించింది. గతం ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా, ఫిర్యాదు అందిన మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలనే నిబంధనను ఈ కేసు మరింత బలోపేతం చేసింది.

కోర్టు ధిక్కార హెచ్చరికలు                                     

పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని  తీవ్రమైన కోర్టు ధిక్కారం గా సుప్రీంకోర్టు అభివర్ణించడం చర్చనీయాంశమైంది. స్పీకర్ కార్యాలయం అనేది అనర్హతా పిటిషన్లు   అసెంబ్లీ గడువు ముగియడం పొందే వరకు వేచి చూసే వేదిక కాకూడదని జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ హెచ్చరికల ఫలితంగానే, సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ కంటే ముందే స్పీకర్ అన్ని పిటిషన్లపై తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చింది.                     

నిర్ణయం ఏదైనా స్పీకర్ ప్రకటించాల్సిందే !   ఈ కేసు ఫలితంగా పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించినప్పటికీ, న్యాయపరంగా చూస్తే ఇది పిటిషనర్ల విజయంగానే భావించవచ్చు. ఎందుకంటే, నిర్ణయాన్ని వాయిదా వేసే హక్కు స్పీకర్‌కు లేదని, అది కేవలం రాజ్యాంగబద్ధమైన బాధ్యత మాత్రమేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా స్పీకర్లు అనర్హతా పిటిషన్లపై ఇష్టానుసారంగా కాలయాపన చేయడానికి వీలులేని విధంగా ఒక గట్టి సంకేతాన్ని ఈ తీర్పు పంపింది.