మాజీ సీఎం కేసీఆర్‌ బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు యశోద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ విడిచిపెట్టి నేరుగా ఫామ్‌హౌస్‌ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు, పార్టీ నాయకులు ఆయనతో సమావేశమవుతున్నారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని వారికి భరోసా ఇస్తున్నారు. 


గురువారం నాడు ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసం జన సందోహంతో నిండిపోయింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు కేసీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ అభిమాన నేతను కలిసి కరచాలనం చేసి భుజం మీద చేతులు వేయించుకుని మరీ ఫోటోలు దిగారు. అభిమాన నేతతో సెల్ఫీలు తీసుకున్నారు.


తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు ప్రజలతో కేసీఆర్ మాట్లాడారు. ఓపికతో అందర్నీ పలకరించారు. తాము కేసీఆర్ ను ఇంకా సీఎం గానే భావిస్తున్నట్టు చెప్పారు. తమ మనసులో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమనేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గానే ముద్ర ఉన్నట్టు కొంత మంది యువకులు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఓ అభిమాని తిరుమల తిరుపతి దేవస్థానం చిత్రపటాన్ని తన అభిమాన అధినేతకు బహూకరించారు.