YS Sharmila News: వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో బాగా రాణిస్తారని అన్నారు. ఇప్పటికే పార్టీలోకి షర్మిల వచ్చారని, ఆంధ్రా కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్ అని వీహెచ్ అన్నారు. షర్మిల గతంలో ఎక్కడ నష్టపోయారో అక్కడే సాధించుకోవాలని అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో వీ హన్మంతరావు మీడియాతో మాట్లాడారు. షర్మిలని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నారని వీహెచ్ అన్నారు. సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రకటనతో ప్రజలు తెలంగాణలో తమ పార్టీకి పట్టం కట్టారన్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ 20-20 టోర్నమెంట్ ఫైనల్‌కి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రావాలని ఆహ్వానించినట్లు వి.హనుమంతరావు తెలిపారు.


షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వెళ్తేనే ఆ ప్రజల్లో ఆలోచనా విధానం మారుతుందని అన్నారు. ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాలని వీహెచ్ ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు అన్నదమ్ములగా కలిసి ఉందామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని జిల్లాలో సమావేశాలు పెట్టి కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని రేవంత్‌ రెడ్డి బయటకు తెచ్చారని అన్నారు. ప్రజలకు తమపై నమ్మకం ఉందని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సోనియా గాంధీకి అప్పగించాలని ప్రజలకు వీహెచ్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి అందరం కష్టపడాలని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి అందరికీ న్యాయం చేస్తారని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నెల రోజులు కూడా కాకుండానే బీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు మరీ తొందర పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చి.. మొత్తం మర్చిపోయిందని అన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారని.. ధరణి పేరు మీద పేదల భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేరుస్తామని వి. హనుమంతరావు మరోసారి చెప్పారు.


సోనియాగాంధీ ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామన్నారు. ఆరు గ్యారంటీలు అమలుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అండర్ 18 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ కి రావాలని కోరామని అన్నారు.