Telangana Congress Meeting: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టాక... తొలిసారి పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్  అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఈ మీటింగ్‌పై ఆసక్తి రేగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన  జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ థాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌  చౌదరి, విశ్వనాథ్‌తోపాటు పార్టీ సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు.


ఈ సమావేశంలో ప్రధానంగా... డీసీసీల నియామయంపై చర్చించబోతున్నారు. అభ్యర్థుల ఖరారు సమయంలో కొంత మంది డీసీసీలు పార్టీకి రాజీనామాలు చేశారు. దీంతో  ఆయా స్థానాల్లో డీసీసీల నియామకాలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు  సన్మానం చేయాలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్‌ పార్టీ. ఈ సన్మాన సభకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఈ మీటింగ్‌లో చర్చించబోతున్నారు. సన్మాన సభ ఎప్పుడు  పెట్టాలి.. ఎక్కడ పెట్టాలి అనే విషయాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి సహకరించిన పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరికీ కూడా ఈ సమావేశంలో  ధన్యవాదాలు తెలపబోతున్నారు. 


అంతేకాకుండా... పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు తమ టికెట్లను త్యాగం చేశారు. అలాంటి వారికి ఎమ్మెల్సీ వంటి పదవులు ఇస్తామని ఎన్నికల సమయంలోనే రేవంత్‌రెడ్డి  భరోసా ఇచ్చారు. ఆ అంశంపై కూడా పీఏసీ సమావేశంలో చర్చించబోతున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై కూడా సమాలోచనలు చేయనున్నారు. టికెట్‌ ఆశించి దక్కని  వారికి నామినేషన్‌ పోస్టులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శలు, కార్యదర్శల నియామకాలు కూడా త్వరలోనే ఉంటాయని చర్చ జరుగుతోంది. దీనికి  సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. 


పార్టీ-ప్రభుత్వం మధ్య అనుసంధానం అనే ప్రధానాంశంపై కూడా పీఏసీలో చర్చకు రానుంది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు.. దానికి సంబంధించిన  వ్యవహారాలన్నింటినీ కూడా పీఏసీలో చర్చించబోతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నందున... ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహంతో  ముందుకు వెళ్లాలి అనే అంశాలపై కూడా సమాలోచనలు చేయనున్నారు. ఈనెల 28న కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఉన్నందున... రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల  నిర్వహణపై కూడా పీఏసీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.