Telangana Congress MLA Anirudh Reddy demands apology from Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. కోనసీమ పచ్చదనం అంశంలో తెలంగాణకు ముడిపెట్టి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయి. గోదావరి జిల్లాల పచ్చదనం, రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడుతూ తెలంగాణ నాయకుల "దిష్టి" వల్ల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పడంతో తెలంగాణ రాజకీయ నేతలు విమర్శలుచేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే డి. అనిరుధ్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ సినిమా 'ఓజీ'కు 800 రూపాయల టికెట్ ధర పెట్టి కొని ప్రొడ్యూసర్లను కాపాడామని, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు.
కోనసీమలో జరిగిన అధికారిక కార్యక్రమంలో పవన్ కల్యాణ్ దిష్టి వ్యాఖ్యలు
నవంబర్ 26న గోదావరి జిల్లాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నాయకులు గోదావరి పచ్చదనాన్ని చూసి ఆసూయ చెందారన్నారు. గోదావరి జిల్లాల పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ నాయకుల దిష్టి తాకడం వల్లే కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అని పవన్ పలికారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇన్నేళ్లు మీ దిష్టి మా తెలంగాణకు తాకింది అని కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలు తెలివితక్కువ మాటలని అని జగదీష్ ఘాటుగా స్పందించారు.
ఓజీ సినిమాను రూ. 800 పెట్టి చూశామన్న ఎమ్మెల్యే
కాస్త ఆలస్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందించారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. నీ ప్లాప్ అయిన సినిమా కూడా ప్రొడ్యూసర్లు బతకాలని 800 టికెట్ ధర పెట్టి చూసాము. కానీ నువ్వు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. సెప్టెంబర్ 2025లో విడుదలైన ఓజీ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు 800 రూపాయల వరకు టికెట్ ధర పెంచే అనుమతి ఇచ్చింది.
ఇప్పటికే పవన్ పై బీఆర్ఎస్ నేతల విమర్శలు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పవన్‌పై ఏకకాలం దాడి చేస్తున్నారు. ఆంధ్రలో టీడీపీ-జనసేన కూటమి మౌనంగా ఉంది. పవన్ కళ్యాణ్ త్వరలో క్షమాపణ చెప్పకపోతే, ఈ వివాదం మరింత ఊపందుకుంటుందని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపరచడం ద్వారా పవన్ తన ఇమేజ్‌ను దెబ్బతీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.