Telangana Bhavan Opening: ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ లో పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎంపీ వెంకటేష్ నేత పూజలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆఫీసును ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏర్పాటు చేసిన యాగశాల, సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటి అంతస్థులోని తన చాంబర్ కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు. 

20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో..!

గతేడాది వసంత్ విహార్‌లో BRS ఆఫీస్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన మంత్రులు, ఎంపీల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణాదికి చెందిన పార్టీల్లో ఢిల్లీలో కార్యాలయం ఉన్న తొలి పార్టీ తమదేనని BRS చెబుతోంది. అంతే కాదు. దేశ రాజధానిలో 20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవానాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ ఉన్నట్టుగానే... ఢిల్లీలోనూ అదే తరహాలో తెలంగాణ భవన్‌ను కట్టారు. అయితే దీనికి ఇంకా సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌ను నాలుగు అంతస్తులుగా నిర్మించనున్నారు. కాన్ఫరెన్స్ హాల్‌, లైబ్రరీ, ఆడియో విజువల్ థియేటర్‌ ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు ఈ తెలంగాణ భవన్‌ను వినియోగించుకోవాలని చూస్తోంది పార్టీ. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దిల్లీకి పయనమయ్యారు. అక్కడే ఉండి నిర్మాణ పనులను పరిశీలించారు. దిల్లీలో తెలంగాణ పదం పలకాడానికి, వినడానికి అవకాశాలు లేని పరిస్థితుల నుంచి అక్కడ బీఆర్ఎస్ సొంత కార్యాలయాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

కర్ణాటకలో సీఎం కేసీఆర్ పర్యటన

వివిధ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొని రావడం, సదస్సులు, సమావేశాలు నిర్వహించడానికి పార్టీ కార్యాలయాన్ని ఉపయోగించనున్నారు. ఇకపై ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం అనేక జాతీయ స్థాయి చర్చలకు వేదికగా పని చేయనున్నది. ఢిల్లీ పర్యటన అనంతరం కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున  ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరపున ప్రచారం చేసేందుకు సీఎం కేసీఆర్ బహుశా అక్కడికి వెళ్లే అవకాశం ఉందని పార్టీ అంతర్గత సమాచారం. కేసీఆర్‌ను జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కర్ణాటకలో తమ పార్టీకి ప్రచారం చేయాల్సిందిగా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ ఢిల్లీ  పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం  ఉందని తెలిపాయి.