CM Vijay Free Gold Ring Scheme: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు తెరలేపిన నటుడు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం.. ప్రజల్లోకి దూసుకెళ్లేలా ఒక వినూత్న ప్రజాకర్షక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి బిడ్డకు ఉచితంగా ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహూకరించేలా మేనమామ బంగారు ఉంగరం పథకం అనే ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తమిళ సంస్కృతిని, సంప్రదాయాలను మేళవించి సీఎం విజయ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త సెంటిమెంట్ పథకం హాట్ టాపిక్‌గా మారింది.
తమిళ సాంప్రదాయం ప్రకారం.. కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ శిశువుకు మేనమామ మొదటిసారిగా బంగారు ఉంగరాన్ని బహుమతిగా తొడగడం అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. అయితే, పేదరికంలో ఉన్న ఎంతోమంది మేనమామలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ముచ్చట తీర్చుకోలేకపోతున్నారు. ఈ సెంటిమెంట్‌ను, సామాన్యుల భావోద్వేగాలను గుర్తించిన ముఖ్యమంత్రి విజయ్.. పేద కుటుంబాలకు తానే మేనమామ స్థానంలో నిలబడతానని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టే ప్రతి బిడ్డకూ మేనమామ స్థానంలో ప్రభుత్వమే ఈ ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందిస్తుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.
తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , పురపాలక క్లినిక్‌లలో ప్రసవించే తల్లులందరికీ ఈ పథకం వర్తిస్తుందని తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రసవం ముగిసిన వెంటనే ఆసుపత్రి యంత్రాంగం ద్వారానే ఈ ఉంగరాన్ని తల్లిదండ్రులకు అందజేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వినూత్న పథకం కేవలం సెంటిమెంట్ కోసమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా ప్రోత్సహించడానికి మరియు తల్లీపిల్లల మరణాల రేటును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ నిపుణులు భావిస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక పథకం అమలు కోసం తమిళనాడు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్ నుంచి ఏటా రూ. 755.83 కోట్లను ఈ ఒక గ్రాము బంగారు ఉంగరాల పంపిణీ కోసం ఖర్చు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదయ్యే వార్షిక ప్రసవాల సగటు గణాంకాలను ఆధారంగా చేసుకుని, నిధుల కొరత లేకుండా లబ్ధిదారులందరికీ సకాలంలో ఈ ఉంగరాలు అందేలా తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే సీఎం విజయ్ ఈ స్థాయి భారీ సంక్షేమ పథకానికి జీవో జారీ చేయడంపై మహిళలు, పేద కుటుంబాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. గతంలో తమిళనాడు పాలిటిక్స్‌లో ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, ఉచిత ల్యాప్‌టాప్‌లు వంటి పథకాలు సంచలనం సృష్టించగా.. ఇప్పుడు తమిళ సంస్కృతితో ముడిపడిన ఈ 'తాయా మామన్ తంగ మోదిరమ్ తిట్టమ్' నేరుగా ప్రజల హృదయాలను తాకుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం ద్వారా ముఖ్యమంత్రి విజయ్ ప్రతి ఇంట్లో ‘మేనమామ’గా మారి తన రాజకీయ పునాదిని మరింత పటిష్టం చేసుకుంటున్నారనే చర్చ తమిళనాట నడుస్తోంది.
