Tamil Nadu CM MK Stalin : ప్రతి ఒక్క మహిళ ఖాతాలో రూ.5వేలు - ఎన్నికలకు ముందు స్టాలిన్ సర్కార్ సంచలనం
Tamil Nadu : తమిళనాడు సీఎం స్టాలిన్ తమిళనాడులో ప్రతి మహిళ అకౌంట్ లో ఐదు వేలు జమ చేశారు. ఇది ప్రలోభపెట్టడమేనని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.

5000 credited in Women bank accounts: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాష్ట్రంలోని కోటి 31 లక్షల మంది మహిళల కోసం ప్రకటించిన రూ. 5,000 నగదు ప్రోత్సాహక పథకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. గతంలో బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల ఖాతాల్లో పదివేల రూపాయలు జమ చేసిన విధానాన్ని అనుసరిస్తూ, స్టాలిన్ కూడా ఈ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డీఎంకే ప్రభుత్వం ఈ భారీ తాయిలాన్ని ప్రకటించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి మహిళా లబ్ధిదారుని ఖాతాలో నేరుగా రూ. 5,000 జమ చేశారు. ప్రభుత్వం దీనిని సంక్షేమ పథకంగా అభివర్ణిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం ఇది ముమ్మాటికీ ఓటర్లను ప్రలోభ పెట్టడమేనని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ , నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీలు ఈ నిర్ణయంపై నిప్పులు చెరుగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్నా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి పథకాలను తెరపైకి తెస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ అంశంపై స్పందిస్తూ.. ఎన్నికల వేళ ఓటర్లకు నగదు పంపిణీ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడింది. అభివృద్ధి పనులను విస్మరించి, ఎన్నికల షెడ్యూల్‌కు కొద్ది రోజుల ముందు ఇలాంటి నగదు బదిలీ పథకాలు చేపట్టడం డీఎంకే భయాన్ని సూచిస్తుందని వారు ఎద్దేవా చేశారు. మరోవైపు, రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ కూడా స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు శాశ్వత ఉపాధి, అభివృద్ధిని చూపించకుండా ఇలాంటి తాత్కాలిక తాయిలాలతో మోసం చేస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు.
பிப்ரவரிமார்ச்ஏப்ரல் மாதங்களுக்கான உரிமைத்தொகை ரூ.3000 மற்றும் கோடைக்கால சிறப்புத் தொகுப்பாக ரூ.2000 என மொத்தம் ரூ.5000 1.31 கோடி மகளிரின் வங்கிக்கணக்கில் வரவு வைக்கப்பட்டுள்ளது.@mkstalin @Udhaystalin @sivasankar1ss #வெல்வோம்_ஒன்றாக #ஸ்டாலின்_தொடரட்டும்_தமிழ்நாடு_வெல்லட்டும் pic.twitter.com/hRCAk6dtyY
— Selva Stalin-தமிழ்நாட்டை தலைகுனிய விடமட்டேன். (@Selva__Stalin) February 13, 2026
డీఎంకే శ్రేణులు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మహిళా సాధికారతలో భాగంగానే ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నామని వారు సమర్థించుకుంటున్నారు. బీహార్‌లో మోదీ అనుసరించిన వ్యూహాన్ని స్టాలిన్ తమిళనాడులో అమలు చేయడం ద్వారా మహిళా ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నగదు పంపిణీ తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో, రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.























