తాలిబన్లను చూస్తేనే ఒకప్పుడు అఫ్గాన్ లో మహిళలు బెదిరిపోయేవారు. కానీ కాలం మారింది. మహిళల్లో చైతన్యం పెరిగింది. తాలిబన్లు అఫ్గాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ మా హక్కులను కాలరాసే అధికారం మీకెక్కడిదంటూ మహిళలు నినదిస్తున్నారు. దుష్టమూకల ఆరాచక పాలనకు ఎదురొడ్డుతున్నారు.


విద్య, ఉద్యోగం తదితర రంగాల్లో హక్కుల సాధనతోపాటు దేశంలో కొత్తగా కొలువుదీరనున్న తాలిబన్ల ప్రభుత్వంలో తమకూ భాగస్వామ్యం కల్పించాలంటూ పోరాడుతున్నారు. తాలిబన్లు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు.


మహిళలే..










తాలిబన్ల ఆపద్ధర్మ సర్కార్ ఏర్పడిన తర్వాత నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ హక్కుల కోసం నిరసన బాటపట్టారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నిరసనలను అడ్డుకోవాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు.





ఎవరైన నిరసన వ్యక్తం చేయాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని, ఎలాంటి నినాదాలు, బ్యానర్లు వినియోగిస్తున్నారో వెల్లడించాలని తాలిబన్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ ఏజెన్సీ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం ఆందోళనకారులపై తాలిబన్లు క్రూరంగా వ్యవహరిస్తున్నారు. దాడులు కూడా చేస్తున్నారు.


ఇందుకోసమే..


ఇస్లామిక్ రూలర్లకు వ్యతిరేకంగా తమ హక్కుల కోసం గళం విప్పుతోన్న మహిళలను అడ్డుకోవాలని తాలిబన్లు నిర్ణయించారు. ఈ మేరకు తాలిబన్ల సర్కార్ లోని న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుత సమయంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, ఏ కారణంతోనూ ఆందోళన చేయకూడదని పేర్కొంది.


ఒకవేళ నిరసన వ్యక్తం చేయాలంటే న్యాయమంత్రిత్వశాఖ నుంచి కచ్చితమైన అనుమతి తీసుకోవాలని తాలిబన్లు ప్రకటించారు. నిరసనకు గల కారణాలు, ఎక్కడ ఏ సమయంలో చేస్తారు సహా స్లోగన్ వివరాలను కూడా తెలియజేయాలని వెల్లడించారు.