BJP women MPs write to Lok Sabha speaker:  పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. గత బుధవారం సభలో చోటుచేసుకున్న పరిణామాలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.  గత బుధవారం లోక్‌సభలో చోటుచేసుకున్న అసాధారణ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా చోటుచేసుకున్న రభసపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీ సీటును చుట్టుముట్టడమే కాకుండా, ఆయన ఛాంబర్ వైపు దూసుకెళ్లడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంటూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ మహిళా ఎంపీలు లేఖ రాశారు.

బీజేపీ విడుదల చేసిన వీడియో కలకలం 

ఈ వివాదానికి బలం చేకూర్చేలా బీజేపీ ఒక వీడియోను విడుదల చేసింది. అందులో కాంగ్రెస్ మహిళా ఎంపీలు వ్యూహాత్మకంగా ప్రధాని సీటు వైపు వెళ్లడం, ఒకరికొకరు సైగలు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఆకస్మిక నిరసన కాదని, ప్రధానిని భయపెట్టేందుకు చేసిన ముందస్తు ప్రణాళిక అని బీజేపీ ఆరోపిస్తోంది. సభలో పేపర్లు విసరడం, వెల్‌లోకి దూసుకెళ్లడం వంటి చర్యలు పార్లమెంటరీ మర్యాదలను మంటగలిపాయని బీజేపీ మహిళా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తీసుకునే ఏ చర్యకైనా తాము మద్దతుగా ఉంటామని వారు స్పష్టం చేశారు.  

తప్పుడు ప్రచారమేనని కాంగ్రెస్ ఆరోపణ

మరోవైపు బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. తమ నిరసన అంతా శాంతియుతంగానే సాగిందని, ప్రభుత్వం చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని కాంగ్రెస్ మహిళా ఎంపీలు మండిపడ్డారు. అధికార పక్షం తమపై చేస్తున్న వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ వారు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తమ గొంతు నొక్కేందుకే బీజేపీ ఇటువంటి డ్రామాలు ఆడుతోందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం పదేపదే నిరాకరించడం వల్లే తాము నిరసన చేపట్టాల్సి వచ్చిందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇదే సమయంలో ఒక బీజేపీ ఎంపీ దూబే మాజీ ప్రధానులపై  అభ్యంతరకర  వ్యాఖ్యలు చేయడం మంటలకు ఆజ్యం పోసింది. అధికార పక్షమే సభలో విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోందని, సమస్యలను పక్కదారి పట్టించేందుకే మహిళా ఎంపీల ప్రవర్తనను భూతద్దంలో చూపిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

 స్తంభించిన లోక్‌సభ 

పరస్పర ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకవైపు ప్రధాని భద్రత , సభా మర్యాద గురించి బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష నేతకు మాట్లాడే స్వేచ్ఛ లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి సభలో ఇరు పక్షాల మధ్య ఈ స్థాయి గొడవ జరగడం భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక  చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది.