తిరుపతి: తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను మోసం చేసే దళారులు, నకిలీ వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు  భక్తులను మోసం చేసిన కేసులో సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగిని తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుడిని తిరుపతి కోలా స్ట్రీట్‌కు చెందిన జలకర గిరిధర్ (34)గా గుర్తించారు. ఇతను టీటీడీ కార్యాలయంలో సబార్డినేట్ (క్లాస్–4) ఉద్యోగిగా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Continues below advertisement

ఫోన్ పే నెంబర్‌కు పలు వాయిదాల్లో నగదు ట్రాన్స్‌ఫర్

నిందితుడు తాను టీటీడీలో పేష్కార్‌గా పనిచేస్తున్నానని, తన పలుకుబడితో శ్రీవారి సేవా టికెట్లు ఇప్పించగలనని శ్రీవారి భక్తులను నమ్మించేవాడు. భక్తులకు నమ్మకం కలిగించేందుకు తన టీటీడీ గుర్తింపు కార్డు ఫొటో కూడా పంపేవాడు. ఇటీవల ఈతముక్కల సుబ్రహ్మణ్యం నాయుడు అనే భక్తుడిని నమ్మించి, నిందితుడి ఫోన్‌పే నంబర్‌కు పలు విడతల్లో రూ.1,56,000 ట్రాన్స్‌ఫర్  చేయించుకున్నాడు. మే 24న టికెట్ల కోసం భక్తులు తిరుమల ఎస్‌ఎంసీ ప్రాంతానికి చేరుకున్న సమయంలో నిందితుడు తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి మెల్లగా జారుకున్నాడు. 

Continues below advertisement

బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.  శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి భక్తుల నుంచి నగదు తీసుకోవడంతో పాటు, తిరుపతికి చెందిన మరో వ్యక్తికి టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3,60,000 తీసుకుని మోసం చేసినట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడు.

Also Read: Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు

నిందితుడు వివిధ సందర్భాల్లో మొత్తం సుమారు రూ.10 లక్షల మేర మోసాలకు పాల్పడినట్లు తిరుపతి పోలీసులు గుర్తించారు. ఈ మోసాలకు సంబంధించి నమోదైన కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని న్యాయస్థానంలో ఎదుట హాజరుపరచగా, కేసు వివరాలు, నిందితుడి నేర చరిత్రను పరిశీలించిన న్యాయమూర్తి 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

దళారుల్ని నమ్మి మోసపోవద్దు- శ్రీవారి భక్తులకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు దళారులు, నకిలీ వ్యక్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరికైనా డబ్బులు చెల్లించే ముందు వారి వివరాలను పూర్తిగా నిర్ధారించుకోవాలన్నారు. శ్రీవారి దర్శనం, సేవలు, వసతి తదితర సేవలకు సంబంధించిన టికెట్లు, బుకింగ్‌లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌ల ద్వారా పొందాలన్నారు. వ్యక్తిగతంగా డబ్బులు చెల్లించి దళారుల ద్వారా టికెట్లు పొందే ప్రయత్నం చేయవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. భక్తులను మోసం చేసే వ్యక్తులు, దళారుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు.